Feb 11,2021 07:24

ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌పై కమలం పార్టీ చేస్తున్న కుట్ర బట్టబయలైంది. సమైక్య రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రాజధానిగా ఖ్యాతి పొందిన విశాఖ ప్రాధాన్యత విభజన తరువాత మరింతగా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ నగరం గుండెకాయ! ఇంత కీలకమైన ఈ నగరాన్ని, అక్కడి వనరులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? కానీ మోడీ సర్కారు చేస్తున్నదేమిటి? ఇప్పుడంటే విశాఖకు స్టీల్‌ సిటీగా, ఉక్కునగరంగా గుర్తింపు వచ్చిందికానీ, తొలుత పోర్టు సిటీగానే ఈ నగరానికి అస్థిత్వం! విశాఖ ఓడరేవు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన తొలి గుర్తింపును ధ్వంసం చేయడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పోర్టులనూ ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనతో విశాఖ పోర్టు పైనా భవిష్యత్తులో ఆదానీదో, అంబానీదో జెండా ఎగరనుంది. తూర్పు నావికా దళ కేంద్రంగా కూడా విశాఖకు గుర్తింపు ఉంది! రక్షణ రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులను అనుమతించిన తరువాత ఈ కేంద్రం పేరు గొప్పగానే మిగిలే పరిస్థితి! రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటు కావాల్సిన రైల్వేజోన్‌ విషయం ఇప్పటివరకు అతీగతీ లేదు. దానికోసం ఆందోళనలు జరుగుతుండగానే డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ ప్రతిపాదనను కేంద్ర సర్కారు ముందుకు తీసుకువచ్చింది. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య సరుకు రవాణా కోసమే పూర్తిగా ప్రైవేటు రంగంలో ఈ కారిడార్‌ రానుంది. దీనర్ధం ఏమిటి? ఇప్పటిదాకా విశాఖ రైల్వే డివిజన్‌ అత్యధికంగా ఆదాయం సాధిస్తుండగా, దానిలో అధిక వాటా సరుకు రవాణాదే! ఇప్పుడు ఈ భాగాన్ని ప్రైవేటుకు పందారం చేయడానికి కమలనాథులు సిద్ధమైపోయారు. ఇక మిగిలిందేమిటి? పిప్పి! ఈ పిప్పితో రేపోమాపో రైల్వేజోన్‌ను ప్రకటించవచ్చుగాక! ప్రయోజనం ఏమిటి? కరి మింగిన వెలగపండు స్థితే కదా! మొదటి విడత పదవీకాలంలో చట్ట ప్రకారం ఇయ్యవలసినవి ఏవీ ఇవ్వకుండా అడ్డుపడ్డ మోడీ అండ్‌ కో రెండవ విడత గెలిచాక ఉన్నవి కూడా గుంజుకుంటున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో భారతీయ బడా కార్పొరేట్లు కొత్తగా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెడుతున్నదీ లేదు. నష్టాల పాలైన పరిశ్రమలను ఉద్ధరించి లాభాల బాటలో నడిపిన దాఖలా అసలు లేనే లేదు. రానున్న కాలంలో లాభాలను తెచ్చిపెట్టగల విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కారుచవకగా స్వంతం చేసుకోవడం, ప్రజలు తమ కష్టార్జితాన్ని ఎంతో నమ్మకంతో దాచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను, బీమా సంస్థలను చేజిక్కించుకోవడం, విలువైన భూములను, సముద్ర తీరాన్ని, గనులను కాజేయడం కార్పొరేట్ల వ్యూహం. దీనినే మోడీ ప్రభుత్వం 'బడ్జెట్‌' అనే పేరు పెట్టి అమలుచేస్తోంది. ఈ స్వార్ధపర, కుటిల వ్యూహానికి మన నవ్యాంధ్రప్రదేశ్‌ బలైపోతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అంగీకరించబోమంటూ ఇటు ముఖ్యమంత్రి జగన్‌, అటు ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రకటించారు. మంచిదే! కానీ, రాష్ట్రానికి ఇంత చేటు తెచ్చే బడ్జెట్‌ను ఈ పార్టీలు ఎలా స్వాగతించాయో నేడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. 'బిజెపిదే తుది నిర్ణయం' అన్న ప్రకటనతో జనసేనాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకుండానే తెల్లజెండా ఎత్తినట్టయింది.
ఈ కుట్రలు, కుతంత్రాలపై విశాఖ ఉక్కు కార్మికులు ఇప్పటికే సమరశంఖం పూరించారు. ఉక్కు కర్మాగార అమ్మకాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వారు చేస్తున్న పోరాటానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఎక్కడికక్కడ ప్రజానీకం కదులుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికులు చేస్తున్న ఈ పోరాటాన్ని బేషరతుగా బలపరచడానికి వైసిపి, టిడిపి లు సిద్ధపడాలి. కార్మిక సంఘాల నాయకత్వంతో, కర్షక సంఘాల మద్దతుతో జరిగే ఈ తరహా పోరాటంతోనే కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి, వారి కనుసన్నల్లో నడిచే సంఫ్‌ు పరివార్‌ కుయుక్తుల నుండి రాష్ట్రాన్ని, విలువైన మన పరిశ్రమలను, సహజ వనరులను కాపాడుకోగలం.