మాట్లాడుతున్న కమిషనర్
కమిషనర్ సచివాలయముల ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక 45/1 జేమ్స్ గార్డెన్, 46/2 కాపువీధి వార్డు సచివాలయాలను కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని తనిఖీ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు. సచివాలయాల పరిధిలోని ప్రజలకు స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందిస్తున్న ఉచిత వైద్యం, మందుల పంపిణీ, రక్త పరీక్షలు తదితర సేవలపై అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.సచివాలయాలలో పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని కార్యదర్శులకు కమిషనర్ సూచించారు. ఎస్.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి, సూచించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలన్నారు. అదేవిధంగా స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు, నాడు - నేడు పనుల పురోగతి, ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమంతప్పకుండా పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.










