Aug 01,2023 21:28

కమి షనర్‌ సూర్యసాయిప్రవీన్‌చంద్‌

ముఖ్యనేత స్థావరంలో కార్పొరేటర్ల భేటీ
కమిషనర్‌ వైపునకే కార్పొరేటర్లు మొగ్గు
 కడప ప్రతినిధి : కడప కార్పొరేషన్‌ కమి షనర్‌ సూర్యసాయిప్రవీన్‌చంద్‌ బదిలీకి మంత్రాంగం నడుస్తోంది. నగరానికి చెందిన ముఖ్యనేత 38 మంది కార్పొరేటర్లను పిలిపించు కుని రహస్య సమావేశం నిర్వ హించినట్లు ప్రచారం. వైసిపికి చెందిన ముఖ్య నేత స్వగృహంలో సోమవారం సాయంత్రం 38 మంది కార్పొరేటర్లు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదు నుంచి 10 మంది కార్పొరేటర్లు కమిషనర్‌ బదిలీకి మొగ్గు చూపిం చినట్లు సమాచారం. మిగిలిన 28 మందికిపైగా కార్పొ రటర్లు కమిషనర్‌ కారణంగానే కార్పొరేషన్‌లో అభివృద్ధి జరు గుతోందని, ఇటువంటి కీలక సమయంలో కమిషనర్‌ను బదిలీ చేయించడం తగదనే అభిప్రాయ పడినట్లు తెలిసింది. ముఖ్యనేత చేసేదేమీ లేక మిన్నకుండిపోయినట్లు సమాచారం. కార్పొరేషన్‌ కమిషనర్‌ను బదిలీ చేయడానికి అవసరమైన కారణాలు లేకపోవడం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కమిషనర్‌ బదిలీ గురించి నేరుగా చెప్పగలిగే ధైర్యం లేకపోవడంతో ఆలో చనల్లో పడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా మొదలుకుని మేయర్‌ వరకు తమకు ఏమి చేశారని పలువురు కార్పొరేటర్లు ప్రశ్నించినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలా గెలవాలని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే తరహాలో ముందుకెళ్తే కార్పొరేటర్లు ఆర్థికంగా బలహీన పడతారని, దాని ప్రభావం ఎన్నికల్లో విజయావకాశాలపై పడుతుందని భావనతో ఉన్నట్లు తెలుస్తోంది.