Sep 20,2023 22:14

విద్యార్థులు లేరని గదబవలసలో మూతపడ్డ పాఠశాల

ప్రజాశక్తి - వీరఘట్టం : జిల్లాలో ఈనెల 21న పర్యటించనున్న జాతీయ ఎస్‌టి కమిషన్‌కు గిరి తండాలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు పైబడినప్పటికీ గిరిజన తండాలు అభివృద్ధి నోచుకోలేదంటే పాలకుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని గంగంపేట, మూలలంక, గాదిలంక, చిన్న గోరకాలనీ, పెద్దూరు, సింధు నగరం, బల్ల గుడ్డు, నీలంపేట, రామాపురం ,దువ్వనపాడు, గదభవలస, ఎలీషాపురం, రాయిమానుగూడ, బట్టిగూడ, కాగితాడ, శంగరాయపురం గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాల్లేవు. అవస్థల మధ్యే జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాల్లో చిన్నారులకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారింది.
అధ్వాన రహదారులతో అవస్థలు
కాగితాడ, రామపురం,బట్టగూడ ,కె. ఇచ్చాపురం, బల్ల గుడ్డు, గదభవలస తదితర గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. దీంతో గిరి పుత్రులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులు అధ్వానంగా ఉండడం వల్ల గ్రామాలకు 104, 108 వాహనాలు రావడంలేదు. దీంతో వ్యాధుల బారిన పడిన రోగులు సంచు వైద్యులపై ఆధారపడి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు తీవ్ర అవస్థలకు గురవుతున్నట్లు గిరి పుత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల లేక ఇబ్బందులు
మండలంలోని గదభవలస, వంకాయల గూడ, సింధునగర్‌, శృంగరాయపురం, తదితర గ్రామాల్లో పాఠశాల భవనాలున్నప్పటికీ విద్యార్థుల్లేరని ప్రభుత్వాలు మూసివేశాయి. గదబవలసలో 25 మంది విద్యార్థులున్నప్పటికీ ఇక్కడ పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరానున్న కత్తులకవిటికి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బల్ల గుడ్డు నుంచి ఇచ్చాపురం పాఠశాలకు, నీలంపేట నుంచి హుస్సేన్‌పురం పాఠశాలకు, శృంగరాయపురం నుండి బొడ్లపాడు పాఠశాలకు, వంకాయలగెడ్డ నుండి ఎం.రాజపురం పాఠశాలకు విద్యార్థులు కిలోమీటర్లు దాటి పాఠశాలకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్షాల వల్ల ఈ రహదారులు అధ్వానంగా ఉండడంతో పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జాతీయ ఎస్‌టి కమిషన్‌ సభ్యులు గిరితండాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గిరి పుత్రులు కోరుతున్నారు.