ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో కమీషన్ ఏజెంట్ల లెసెన్సుల రెన్యువల్‌లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి ఎగుమతి దారులకు విక్రయిస్తే ఏజెంట్లకు రెండు శాతం కమీషన్ లభిస్తుంది. ఇందుకోసం యార్డులో మొత్తం 1060 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ఐదేళ్ల కాలపరిమితికి లైసెన్సులు ఇస్తారు. ఏటా రూ.6 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే మిర్చి యార్డులో కమీషన్ ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంది. ఒకే వ్యాపారి ఐదేళ్ల తరువాత మళ్లీ కొనసాగాలంటే లైసెన్సు రెన్యువల్ చేయించుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేకుండానే రెన్యువల్స్ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డికి తెలియకుండానే కొంత మంది ఉన్నతాధికారుల మౌఖిక అనుమతితో లైసెన్సులు రెన్యువల్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారుల నుంచి అధికారులు, పాలకవర్గంలోని కీలక వ్యక్తులకు ముడుపులు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ ద్వారా ఎవరికి ఎంత ఇవ్వాలనే అంశంపై మధ్యవర్తుల ద్వారా కథ నడిపించారు. ఒక్కో లైసెన్సుకు కనిష్టంగా రూ.60 వేలు, గరిష్టంగా రూ.2 లక్షల వసూలు చేసినట్టు తెలిసింది.
రైతులకు పెట్టుబడి పెట్టడం, రైతుల పేరున వ్యాపార లావాదేవీలు జరిపి కమీషన్లు తీసుకోవడం, ఇందులో అధికారులకు పాలక వర్గానికి ఎంతో కొంత ముట్టచెప్పడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. యార్డులో జీరో బిజినెస్ కూడా కొనేళ్లుగా కొనసాగుతోంది. ఐదేళ్ల కాలపరమితి పూర్తయిన కమీషన్ ఏజెంట్లు దాదాపు 550 మంది ఉండగా ఇటీవల 390 మందికి లైసెన్సులు రెన్యువల్ చేశారు. ఒక లైసెన్సు దారుడు తాను వ్యాపారం చేయలేని ప్రకటిస్తే కొత్త వ్యక్తికి లైసెన్సు ఇవ్వడానికి అదనంగా కొంత సొమ్ము వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా యార్డులో కొంత మంది మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి ఒక్కొ లైసెన్సుదారుడు నుంచి భారీగా వసూలు చేసినట్టు తెలిసింది. ఇందుకోసం సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు రాకుండా సంబంధిత వ్యాపారి కోర్టును ఆశ్రయించే విధంగా అధికారులే సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పేరు మార్పుతో 170 మందికి లైసెన్సుల రెన్యువల్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం లైసెన్సుల ప్రక్రియ యార్డు చైర్మన్, కార్యదర్శి సంతకాలతోనే జరుగుతున్నట్టు తెలిసింది. కొత్త పాలక వర్గం నియమించే లోగా తాత్కాలిక చైర్మన్ హయాంలోనే జరుగుతున్న ఈ ప్రక్రియపై అనేక విమర్శలు వస్తున్నాయి.
నిబంధనల ప్రకారం రెన్యూవల్ : యార్డు చైర్మన్
కమీషన్ ఏజెంట్లకు నిర్ధేశిత గడువులోగా లైసెన్సు రెన్యువల్ చేయకపోతే వారికి బ్యాంకుల్లో 2 శాతం టిడిఎస్ చెల్లించాల్సి వస్తుందని అందువల్ల సకాలంలో నిబంధనలు ప్రకారమే చేశామని యార్డు చైర్మన్ ఎం.సుధాకర్‌రెడ్డి తెలిపారు. సొమ్ములు వసూలు విషయం తన దృష్టికి రాలేదని, అర్హులైన లైసెన్సు దారులు వస్తే నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.










