ప్రజాశక్తి-కాకినాడ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ద్వారా జిల్లాలో అర్హులైన 976 మంది లబ్ధిదారులకు రూ.6.74 కోట్ల మేర లబ్ధి చేకూరినట్టు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వైఎస్.జగన్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద మూడో విడత ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కొత్తగా పెళ్లయిన జంటలతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధి మొత్తాన్ని జమచేసిన అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కాకినాడ జిల్లాలోని లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కతికా శుక్లా మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, ఆపై వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ఆసరాగా నిలిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి.రమణమూర్తి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద తదితరులు పాల్గొన్నారు.










