ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికే వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకం లబ్ధిదారులైన నూతన దంపతులకు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని లబ్ధిదారులతో ఆయన వర్చువల్ విధానంలో మాట్లాడగా బాపట్ల మండలానికి చెందిన లబ్ధిదారులైన కాకి కల్పన ముఖ్యమంత్రితో మాట్లాడారు. అనంతరం గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హెన్రీ క్రిస్టీనా, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా జిల్లాలోని లబ్ధిదారులైన నూతన దంపతులకు నగదు చెక్కును అందజేశారు. బాల్య వివాహాలు నిరోధించడానికే వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకంలో ఆడ పిల్లలకు పదో తరగతి తప్పనిసరి చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. నా కుటుంబానికి బంధువుగా నిలిచి ఆర్థికంగా ఆదుకున్నారని బాపట్ల మండలానికి చెందిన లబ్ధిదారులు కాకి కల్పన తన మనోభావాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రితో పంచుకున్నారు. వర్చువల్ ద్వారా కలెక్టరేట్ నుంచి ఆమె సిఎంతో మాట్లాడారు. మీ సహాయం నాకెంతో సంతోషం, ధైర్యాన్నిచ్చింది. 2007లో భర్త చనిపోతే నా ఇద్దరు పిల్లలను పెంచడం, చదివించడం, పోషణ భారమయిందన్నారు. 2019 వరకు వితంతు పింఛను కూడా లేక చాలా ఇబ్బంది పడ్డానని ముఖ్యమంత్రికి వివరించారు. మీ హయాంలో వితంతు పింఛన్ మంజూరైందని, నా పిల్లలను చదివించుకోవడానికి సంక్షేమ పథకాలు ఆదుకున్నాయి. స్తోమత లేక అప్పుచేసి నా కుమార్తెకు పెళ్లి చేశాను. ఇబ్బందులు పడుతున్న సమయంలో నాకు బంధువుగా నిలిచి రూ.ఒక లక్ష నగదు ఆర్థిక సాయంగా అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. జిల్లాలో 226 నూతన దంపతులకు రూ.1.80 కోట్ల నగదు విడుదలయిందన్నారు. పేదలకు మేలు చేయడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రితో అన్నారు. పేద కుటుంబాలలో వివాహం చేసుకున్నవారికి ఆర్థిక సాయం చేయడం సంతోష దాయకమని గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ హెన్రీ క్రిస్టీనా అన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికే వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకంలో మార్పులు తెచ్చారని శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత చెప్పారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఈ.బి.సి.లకు పారదర్శకంగా పథకాల లబ్ధి చేకూరుస్తున్నారని వివరించారు. పేదరికాన్ని పోగొట్టడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలతో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు వేస్తున్నారని చెప్పారు. పేదలు ఆత్మస్థైర్యంతో బ్రతకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నగదుతో పాటు నమ్మకాన్ని ఇచ్చారని శాసనసభ్యులు కోన రఘపతి చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలతో గొప్ప మనసున్న నాయకుడిగా ప్రజలలో నిలిచారన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే నగదు ఇస్తున్నారని వివరించారు. పేద కుటుంబాలు ఏ పరిస్థితుల్లో చితికిపోతున్నాయో గుర్తించి వారికి మేలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సమానత్వం అమలయ్యేలా సమర్థంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి బి అర్జునరావు, ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి రాజదెబోరా, డిఆర్‌డిఎ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.










