
ప్రజాశక్తి-చోడవరం
చోడవరం-అనకాపల్లి ప్రధాన రహదారిలో గోవాడ, వెంకన్నపాలెం వద్ద కల్వర్టులు శిథిలమై ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని పునర్నిర్మించాలని, రక్షణ గోడలు నిర్మించాలని కోరుతూ సిపిఎం చోడవరం మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకన్నపాలెం కల్వర్టు వద్ద శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు, నాయకులు ఎస్‌వి.నాయుడు, రొంగలి దేముడు నాయుడు, ఈ.నర్సింహామూర్తి, జి.దేముళ్లు, కోటి, నంబారు మాలినాయుడు, జె.శ్రీనివాస్, కె.జాన్ దీక్షల్లో కూర్చున్నారు. ఈ దీక్షలను సీపీఎం జిల్లా నాయకులు గంటా శ్రీరామ్ ప్రారంభించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు నడుపూడి దేముడు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారుల నుండి సంతకాల సేకరణ చేశారు. మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్.రాజు ఈ మార్గంలో వెళ్తూ సంతకం చేసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనకాపల్లి, పాడేరు, విశాఖ జిల్లాలకు ప్రధాన రహదారిగా ఉన్న ఈ మార్గంలో రోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నారని, అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురౌతున్నారని తెలిపారు. సుమారు ఏడాది కాలంగా కల్వర్టులకు రక్షణ గోడలు పడిపోయిన, బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అయిన ప్రభుత్వ విప్, జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధాన రహదారిలో కల్వర్టులు చాలా ఇరుకుగా ఉండడం నిత్యం ప్రమాదాలకు, ట్రాఫిక్ అంతరాయానికి కారణంగా ఉందన్నారు. ప్రయాణికులు, ప్రజల ప్రాణాలకు ఏదైనా హాని జరక ముందే స్పందించి కల్వర్టులను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.