ప్రజాశక్తి-చోడవరం
చోడవరం -వెంకన్నపాలెం రోడ్డులోని శిథిలమైన కల్వర్టులను వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చోడవరం మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకన్నపాలెం కల్వర్టు వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కల్వర్టు కూలిపోయే స్థితిలో ఉందని, రక్షణ గోడలు కూలిపోవడంతో ఇటీవల కారు కాలువలో పడిపోయిందని, అనేక మంది వాహనదారులు రోజూ ప్రమాదాలకు గురౌతున్నారని తెలిపారు. బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉన్నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అనకాపల్లి, పాడేరు, విశాఖ జిల్లాల కేంద్రాలకు ప్రధాన రహదారిగా ఉన్న దీనిపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేని చేతగాని నాయకులు ఇక్కడ ఉన్నారన్నారు. వెంకన్నపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏడాదిగా హెచ్చరిక బోర్డులు పెడుతున్నా ప్రజాప్రతినిధులు స్పందించలేదని దుయ్యబట్టారు. ప్రమాదకర కల్వర్టులను వెంటనే పునర్నిర్మించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం చోడవరం నాయకులు ఎస్‌వి.నాయుడు, జోగ రాము, పల్లా సత్తిబాబు, జి.హరి, శ్రీను, కొణతాల అప్పలనాయుడు, ఆదినారాయణ, రాపేటి గంగాధర్, రాజు, కొణతాల రాము, సింహాచలం పాల్గొన్నారు.










