Oct 04,2022 22:58

రహదారి క్రుంగిపోయిన దృశ్యం

ప్రజాశక్తి-విఆర్‌.పురం
విఆర్‌.పురం మండల కేంద్రం నుంచి మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గంలోని చిన్నమట్టపల్లి, సున్నంవారిగూడెం గ్రామాల మధ్యలో ఆర్‌ అండ్‌ బి రహదారిలో కల్వర్టు వద్ద రోడ్డు క్రుంగిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ, అనారోగ్యానికి గురైనప్పుడు అంబులెన్స్‌ రావడానికి కూడా వీల్లేకుండా ఉంది. అయినా అధికారులుగాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోలేదు. దీనిపై అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏజెన్సీ మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఉన్న రోడ్లు మరమ్మతులకు గురైతే వాటిని పట్టించుకునే వారే ఉండటం లేదు. ఎన్నికలకు ముందు వివిధ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో మారుమూల గిరిజన గ్రామాల నుండి మండలానికి ప్రయాణం చేయాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చిన్నమట్టపల్లి సున్నంవారిగూడెం మధ్యలో గోయ్యి పడిన రహదారిని పూడ్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.