Oct 13,2023 01:01

ప్రజాశక్తి - భట్టిప్రోలు : అరకొర వేతనంతో పనిచేసే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో గ్రామంలో అవసరమైన కల్వర్టు నిర్మాణ పనులకు వినియోగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భట్టిప్రోలు పంచాయతీలో పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి పనిని చేపట్టకపోగా ఇటీవలే గ్రామంలో కల్వర్టు నిర్మాణ పనులు, సిసి రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. సిసి రోడ్ల నిర్మాణ పనులు వార్డు సభ్యులే చేపడుతున్నారు. కల్వర్టు నిర్మాణం పనులు మాత్రం పంచాయతీ కార్యదర్శి స్వయంగా చేస్తున్నారు. ఒక దశలో కార్యదర్శి కాంట్రాక్టర్ అవతారం ఎత్తినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అవసరమైన కల్వర్టు పనులు చేపట్టడానికి రూ రూ.1.50లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఎం బుక్ రికార్డు ప్రకారం ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులతో అవసరమైన ప్రాంతంలో తూముల ఏర్పాటు చేసి దానిపై కంకర, సిమెంటు కలిపి కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉంది. తాపీ మేస్త్రీలు, కూలీలతో చేపట్టాల్సిన పనిని కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు సాక్షాత్తు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులనే వినియోగించడం పట్ల ప్రజలు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. కార్మికులలో కొంతమంది పారిశుధ్య పనులు చేపడుతుండగా మరి కొంతమంది కార్యాలయంలో వివిధ రకాల పనులు చేస్తుంటారు. పారిశుద్ధ్య కార్మికులు పూర్తిస్థాయిలో గ్రామం మొత్తం పనులు నిర్వహణ చేపట్ట లేకపోవడంతో వీరిపై పెను భారం పడుతుంది. దీని కారణంగా గ్రామంలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య నిర్మూలన జరగటం లేదనేది సుస్పష్టం. అయినప్పటికీ కార్మికుల చేత ఇలాంటి పనులు చేపట్టడం వలన వీరికి అదనంగా ఇచ్చే కూలి  ఏమి లేదు. వీరికిచ్చే రూ.10వేల వేతనంలోనే ఇలాంటి పనులు చేపట్టడంతో కార్మికులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అదేమని అడిగితే కార్మికులను అధికారులు బెదిరిస్తున్నారని ఆరోపణ కూడా ఉన్నాయి. పంచాయతీ కార్మికులతో చేపట్టిన ఈ పనులకు బయట కూలీలతో చేసినట్లుగా రికార్డు కూడా నమోదైనట్లు వినిపిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీనికి గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. ఈ విషయంపై కార్యదర్శి కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కల్వర్టు నిర్మాణ పనులకు బయట కూలీలు దొరకకపోవడం వలన పారిశుద్య కార్మికులతోనే చేపట్టాల్సి వచ్చిందని చెప్పటం గమనార్హం. ఇప్పటికే గ్రామంలో సుమారు 10 కల్వర్టు నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులన్నీ పారిశుద్ధ్య కార్మికుతోనే  చేసినట్లుగా చెప్పటం విశేషం.