Jul 26,2023 23:34

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో కళ్లకలక విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందలాదిమంది దీని బారిన పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పట్టణ సమీపంలోని లింగంగుంట్ల పరిధిలో గల డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ జిల్లా ఆస్పత్రికి రోజుకు 50 మందికిపైగా కళ్లకలక బాధితులు వస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బివి.రంగారావు తెలిపారు. కళ్ల కలక వల్ల ప్రమాదం లేకపోయినా అప్రమత్తంగా ఉండడం అవసరమని చెప్పారు. సొంత వైద్యం కాకుండా కంటి వైద్యనిపుణుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని, ఎం.వి కంటి హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ ముద్దం వివేకానందరెడ్డి చెబుతున్నారు.
వేగంగా వ్యాప్తి...
ఇది ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలవకుండా కనీసం ఒక వారం రోజులపాటు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండాలి. కళ్ల కలక సోకిన వ్యక్తి తాకిన వస్తువులను ఇతరులు తాగకుండా జాగ్రత్తగా తీసుకోవడం వలన వ్యాధిని ఉధృతి కొంతవరకు నివారించొచ్చు. కళ్ల కలక సోకిన వారు తరచూ కళ్లను తాకాల్సి వస్తుంది. అలా తాకిన ప్రతిసారీ చేతులు చేతులు శుభ్రం చేసుకోవాలి.
లక్షణాలు...
కంటి నుండి విపరీతంగా నీరు కారడం, కళ్లు ఎర్రబడటం, రెప్పలు అంటుకుపోవడం, విపరీతంగా పుసులు రావటం, మంట పుట్టడం, కంటిలో ఇసుక పడినట్లు గుచ్చుకోవటం తదితర లక్షణాలుంటే నేత్ర వైద్యులు సంప్రదించాలి. గతంలో కరోనా బారిన పడిన వారిలో ఈ వ్యాధి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది.
కంటి గుడ్డి చుట్టూ తెల్లని పొర రెప్పల వెనక ఉండే పొరను కంజెటైవా అంటారు. దుమ్ము, దూళి, వేడి నీరు, అధిక గాలి కంటి పొరలను తాకితే శరీరంలో సున్నిత భాగమైన కన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. సున్నితమైన అవయవాలు కావడంతో వేగంగా ఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంది. కళ్లు ఎర్రగా మారుతాయి. ఒక కంటికి కానీ కొందరికి రెండు కళ్లకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్‌ కారణంగా కణజాలంలో చేరిన బాక్టీరియా వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.
జాగ్రత్తలు...
కళ్ల కలక బారిన పడినవారు కంటిని తాకకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. మెత్తటి గుడ్డతో కంటి భాగాన్ని ఒత్తిడి తగలకుండా తుడుచుకోవాలి. తరచూ శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇంటి నుండి బయటకు రాకుండా గదిలోనే ఉండాలి. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉండాలి. వారం రోజుల్లోపు తగ్గకపోతే తప్పనిసరిగా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలి. నవజాత శిశువుకు కండ్ల కలక సోకితే ప్రమాదకరం. కండ్ల కలక బాధితులు చిన్నారులకు దూరంగా ఉండాలి. పాఠశాలలు, ప్రజలు ఎక్కువగా గుమ్మి కూడిన ప్రదేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...
వర్షాకాలంలో ఎక్కువగా ఈ అంటువ్యాధి కనిపిస్తుంది. క్రిములు కారణంగా ఇది వ్యాపిస్తుంది. కొన్ని రోజుల్లోనే తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు తప్పనిసరి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నారులకు సోకితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. చుక్కల మందును ఎలాగంటే అలా వాడటం వలన ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వైద్యుల సూచన మేరకే చుక్కల ముందు వేయించుకోవాలి అని డాక్టర్‌ ముద్దం వివేకానందరెడ్డి వివరించారు.