ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : మితిమీరిన ఆహారపు అలవాట్లతో ఊబకాయం వస్తుందని, దీని వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఏషియన్ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ కొండారెడ్డి త్రివేణి అన్నారు. 2030 నాటికి ప్రతి 10 మందిలో ఐదుగురు ఊబకాయం సమస్యతో బాధపడతారని సర్వేల ద్వారా చేసిందని చెప్పారు. ఒబెసిటీ, గైనకాలజీ సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నరసరావుపేట మండలంలోని కేసనపల్లి పరిధిలోగల కృష్ణవేణి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హౄజరైన డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ ఆరోగ్యంలో పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఉన్న పదార్థాలు తీసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఊబకాయం పెరుగుతుందన్నారు. సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమ, మద్యపానం ఒత్తిళ్లు తదితర కారణాలతోపాటు వారసత్వంగానూ ఊబకాయం భారిన పడే అవకాశం ఉందని వివరించారు. ఊబకాయం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, నిద్రలో ఊపిరి తీసుకోలేక గురక పెట్టడం, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శరీరంలో అధిక కొవ్వు చివరికి గుండెపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడక, పరుగు ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చని చెప్పారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన స్త్రీలలో గైనిక్ సమస్యలు ఏర్పడతాయని, పిల్లలనూ వీటికి దూరంగా ఉంచాలని అన్నారు. బర్గర్, పిజ్జా, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార ఉండలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, రెడీమేడ్ శీతల పానీయాలు, మసాలా, చాట్, పకోడీ, బజ్జి వెన్నతో కూడిన కేక్, చాక్లెట్ వంటివి తినకపోవడం మంచిదన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుని మానసిక ఒత్తిడిని జయిస్తే చాలా రోగాలు రాకుండా చూసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత కాలేజీకి వచ్చిన డాక్టర్ త్రివేణికి కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య, సెక్రటరీ - కరస్పాండెంట్ ఎం.రామశేషగిరిరావు మొక్కను బహూక రించి ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం సత్కరించారు.










