ఏడేళ్ల రాధ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఒక రోజు ఇంటిబయట ఆడుకుంటోంది. రాత్రి పొద్దుపోయినా రాధ ఇంటికి తిరిగి రాలేదు. రైల్వే స్టేషన్‌లో అమ్మ చేయి పట్టుకుని నిలబడ్డ పది నెలల చోటూ కనిపించకుండా పోయాడు. ఒక మహిళ చోటూను తీసుకెళ్లడం సి.సి టి.వి ఫుటేజీలో స్పష్టంగా కనబడింది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ఇటువంటి సంఘటనలు దాదాపు దశాబ్దం కాలం కంటే పైగా జరుగుతున్నాయి. 2008లో రెండు లక్షల పైచిలుకు మంది మిస్సింగ్ అయితే వారిలో 70 వేలకు పైగా మైనర్లు ఉన్నారు. మొత్తం సంఖ్యలో ఇప్పటికి 60 వేల మందినే కనుగొన్నారు. మిగిలినవారి జాడ ఇంకా తెలియలేదు. 2019 నాటికి ఆ సంఖ్య 23 వేలకు దగ్గరకు వచ్చింది. సంఖ్యల్లో చూస్తే తగ్గు ముఖం పట్టినట్లుగా కనబడుతున్నా అసలు అంతమంది ఎందువల్ల కనిపించకుండా పోతున్నారు ?
ఎత్తుకెళ్లిన పిల్లలను కొందరు ఆదాయ వనరులుగా ఉపయోగిస్తున్నారు. బాల కార్మికులుగా, వేశ్యావృత్తిలో, అక్రమ దత్తత, నేరప్రవృత్తి శిక్షణలో వారిని భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మిస్సింగ్‌లు జరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. వీటి వెనుక కొన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయని వారి పరిశోధనలో తేలింది. ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (డిసిపిసిఆర్) 2018లో చేసిన పరిశోధన ప్రకారం నగర వ్యాప్తంగా 50 చోట్ల తరచూ చిన్నారులు మిస్ అవుతున్నారు. రోజుకు 19 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. ఆ సంఖ్య ఈ ఏడాది 12కు వచ్చింది. అక్రమ రవాణాకు ఢిల్లీ ప్రధాన రవాణా కేంద్రంగా ఉండడమే ఎక్కువ సంఖ్యలో పిల్లలు మిస్ అవడానికి కారణమని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డిసిడబ్ల్యు) చైర్‌పర్సన్ అంటున్నారు.
కేసుల పట్ల నిర్లక్ష్యం
పిల్లలు తప్పిపోయినట్లు పోలీసు స్టేషనులో కేసు నమోదైన వెంటనే చర్యలు తీసుకుంటే నేరాలను నియంత్రించవచ్చు. కాని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మిస్ అయిన కొన్ని గంటల్లోపు అంటే కీలక సమయం వృథా అవుతోంది. దీంతో ఆ గ్యాంగులు వారిని రాష్ట్రాలు, ఆపై దేశాలు దాటించేస్తున్నాయి. నేరస్తులను పట్టుకోవడం కూడా కష్టంగా మారింది.
విచారణ వేగవంతం
ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఒక ప్రకటన చేశారు. సిబ్బంది ఎవరైతే వెంటనే స్పందించి ఎక్కువ మిస్సింగ్ కేసులను ఛేదిస్తారో వారికి రివార్డులు, ప్రమోషన్లు ఇస్తామని ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించారు. ఈ ప్రకటన కేసుల విచారణలో వేగవంతమైన వృద్ధికి దారితీసింది. ప్రత్యేకంగా ఒక బృందాన్ని మిస్సింగ్ కేసుల పరిశోధన కోసం నియమించారు. 'అసాధారణ కార్య పురస్కార్' పేరుతో కానిస్టేబుళ్లకు రివార్డులు, ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటివరకు విచారణ బృందంలో ముఖ్యంగా పెద్ద కేసుల ఇన్వెస్టిగేషన్‌లో కానిస్టేబుళ్లు భాగస్వామ్య మయ్యేవారు కాదు. కాని ఈ ఏడాది వారితో కలసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల తప్పిపోతున్న పిల్లల్లో ఎక్కువమందిని కనిపెట్ట గలుగుతున్నట్లు ఉన్నతాధికారులు అంటున్నారు.
సీమా ధాకా ఏం చేసింది ?
మిస్సింగ్ కేసుల విచారణలో భాగంగా నియమించిన ప్రత్యేక బృందంలో ఓ కానిస్టేబుల్ సీమా ధాకా. ఆగస్టులో ప్రకటన వెలువడినప్పటి నుంచి మూడు నెలల వ్యవధిలో 76 మంది చిన్నారుల మిస్సింగ్ కేసులను పరిష్కరించారామె. అదృశ్యమైన పిల్లల కేసులను పరిష్కరించటంలో ఒక అమ్మలా స్పందించి, పని చేశారు. ఇప్పుడామెకు అసిస్టెంట్ సబ్ ఇనెస్పెక్టర్ (ఎఎస్‌ఐ)గా ప్రమోషన్ వచ్చింది.
2020 జనవరి 1 నుంచి అక్టోబరు 31 వరకు 3 వేల పైచిలుకు చిన్నారులు అదృశ్యమైతే... 2 వేలకు పైగా చిన్నారులను కనిపెట్టగలిగారు. అధికారుల ప్రకటన వెలువడ్డాక మూడు నెలల్లోనే 1400 మందికి పైగా చిన్నారులను గుర్తించగలిగారు. వారిలో గతంలో తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ మూడు నెలల్లో మళ్లీ 12 వందలకు పైగా చిన్నారులు తప్పిపోయారని అంచనా. అయితే రికవరీ వంద శాతానికి మించి పెరిగిందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ గణాంకాలు ఆశావహంగా ఉన్నా పిల్లల అదృశ్యానికి గల కారణాలను కింది స్థాయి నుంచి నిర్మూలించగలగాలి. ఆ స్థాయిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దేశ రాజధాని లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన దేశంలో బాలల పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచనే భయపెట్టేలా వుంది.
- జ్యోతిర్మయి










