Jul 14,2023 00:25

డిఆర్‌సి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కల్తీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠినమైన చర్యలను తీసుకొని ఉక్కుపాదంతో అణిచివేయాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. తొలుత వ్యవసాయంపై జరిగిన చర్చలో శాసన మండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల పంటలు నష్టపోతే అందించే పరిహారంపై పంటల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక అందించాలన్నారు. కల్తీ విత్తనాల విక్రయాలు జరుగకుండా విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులతో పాటు, విత్తన చట్టం కింద కేసులు నమోదు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులపై వ్వవసాయశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని మంత్రి జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు కనిపించినా సహించబోనని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ యంత్రాంగం మొత్తం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, విజిలెన్సు సహకారం తీసుకుని తనిఖీలు పెంచాలని, దుకాణాలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశంపై సిఎం జగన్‌ సీరియస్‌గా ఉన్నారన్నారు.
కౌల్దార్లకు రుణాలివ్వడం లేదు :  కెఎస్‌ లక్ష్మణరావు
ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కౌలు రైతులందరికీ సిసిఆర్‌సి కార్డులు మంజూరు చేసి బ్యాంక్‌ల ద్వారా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎస్‌బిఐ రైతులకు రుణాలు ఇవ్వడంలేదన్నారు. 19 వేలమంది సిసిఆర్‌సిలు ఇచ్చినా రుణాలు కేవలం రూ.5 కోట్లు ఇచ్చారని అన్నారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు పనులు వేగవంతం చేయాలని కోరారు. జెడ్‌పి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించాలని, ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టిన ఉన్నత పాఠశాలలో ఇంటర్‌ విద్యార్డులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, జగనన్న విద్యా కానుక కిట్లు అందించాలని కోరారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తాగునీటి సరఫరా కోసం మంజూరు చేసిన పైపు లైన్ల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గుంటూరు నగరంలో గోరంట్లలో నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని, నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్‌యుబిల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. బిసి స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు భూమి కేటాయించాలన్నారు. రెవెన్యూశాఖ భూమి కేటాయిస్తే బిసి సంక్షేమ శాఖ భవనం నిర్మాణానికి నిధులు ఇస్తుందన్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. గతేడాది తామర తెగులు వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదన్నారు. కృష్ణా జిల్లాలో కొన్నిచోట్ల రూ.45వేలు, కొంతమందికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారని గుంటూరు జిల్లాలో పరిహారం ఇవ్వలేదని తెలిపారు. బీమా కంపెనీలు ఇవ్వకపోతే ప్రభుత్వమే ఇవ్వాలన్నారు.
మొబైల్‌ డయ్యర్లు ఇవ్వాలి : ఏసురత్నం
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ మిర్చి, కాటన్‌ రైతుల కోసం ఆర్‌బికేల్లో మొబైల్‌ డయర్లను ఉద్యాన శాఖ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా కోసం కృష్ణా నది నుంచి ప్రత్యేకంగా నల్లపాడులో వున్న చెరువుకు పైపులైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నల్లపాడులో 110 ఎకరాల చెరువు అందుబాటులో ఉందన్నారు.
గుంటూరు ఛానల్‌ కట్టలు తెగిపోతాయి : హనుమంతరావు
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌లో తూటికాడ నిర్మూలనకు శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. కాల్వలనిండా నీరు ఉన్నా తూటికాడ, గుర్రుపు డెక్క తొలగించకపోవడం వల్ల కట్టలు తెగిపోయి ప్రమాదం జరగవచ్చన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను అప్కో ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మునిసిపల్‌ పాఠశాలలో టీచర్లను నియమించాలి : కల్పలత
ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యాశాఖలో విలీనమైన మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియమకానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ స్కూల్సులో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించాలన్నారు.
జగనన్న కాలనీలకు అప్రోచ్‌ రోడ్డు వేయాలి :ఆర్‌కె
పేదలందరీకి ఇళ్ల పథకం లే అవుట్‌లకు పూర్తి స్థాయిలో అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. రహదారులు లేక కాలనీల్లో పనులు జరగడం లేదన్నారు. గ్రావెల్‌ రోడ్లు ఒక్క వర్షానికే దెబ్బతింటున్నాయని చెప్పారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు పనులు వెంటనే ప్రారంభించాలని, కట్టలను పట్టిష్ట పర్చాలని కోరారు. పెదవడ్లపూడి హైలెవల్‌ చానల్‌ పెండింగ్‌ పనులకు పూర్తి చేయాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా పండ్ల తోటల పెంపకానికి అందిస్తున్న ప్రోత్సాహాకాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
కాల్వల మరమ్మతులు సకాలంలో జరగాలి : రోశయ్య
గుంటూరు చానల్‌తో పాటు, ఇతర సాగునీటి కాల్వల్లో తూటికాడ తొలగింపు, నిర్వహణ పనుల కాంట్రాక్టర్లు సక్రమంగా చేపట్టేలా ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య కోరరు. పనులు పూర్తయిన తరువాత సంబంధిత గ్రామాల అధికారులు, సర్పంచులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సేకరించిన భూములపై కోర్టులలో వేసిన కేసులపై రెవెన్యూ అధికారులు సరియైన రిట్‌లు వేసి స్టేలు తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ మన బడి నాడు-నేడు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్‌ ఔట్స్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్పత్రుల్లో ధరల బోర్డులు ఉండాలి : ఎమ్మెల్యే ముస్తాఫా
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించిన అడవి తక్కెళ్లపాడులో టిడ్కో గృహాలను లబ్దిదారులకు పంపిణీ చేయాలన్నారు. అంజుమన్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్‌ వైద్యశాలల్లో, పరీక్షా కేంద్రాల్లో వ్యాధి నిర్దారణ పరీక్షల ధరల బోర్డులను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈనెలాఖరు కల్లాఅడవి తక్కెళ్లపాడులో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామన్నారు.
కౌలు రైతులకు రుణాలు ఇప్పిస్తాం : కలెక్టర్‌
జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులందరికి పంట రుణాలు అందించేందుకు బ్యాంకుల వారీగా లక్ష్యాలు నిర్దేశించి ప్రతివారం సమీక్షిస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి నగదు జమకు సంబంధించి సమస్యలుంటే సచివాలయ విద్యా కార్యదర్శిని సంప్రదించి పరిష్కరించుకోవచ్చన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌కు అక్టోబర్‌ నాటికి పైప్‌లైన్‌ ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, నగరకమిషనర్‌ చేకూరి కీర్తి, తెనాలిసబ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివన్నారాయణ, డిసిసిబి ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, డిసిఎంఎస్‌ చైర్‌ పర్సన్‌ భాగ్యలక్ష్మీ, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
గుంటూరు ఛానల్‌ విస్తరణకు ప్రాధాన్యం : మంత్రి ధర్మాన
గుంటూరు ఛానల్‌ విస్తరణ కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని, పనులను త్వరలోనే ప్రారంభిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సమావేశం ముగిసిన తరువాత మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడుతూ ఈ ఛానల్‌ విస్తర ణకు సిఎం జగన్‌ సానుకూలంగా ఉన్నారని, భూసేకరణకు త్వరలో నిధులు వస్తాయని అన్నారు. గ్రామ స్థాయిలోనే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఫ్యామిలి డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇస్తోందని, వైద్యులే గ్రామాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్థారణ చేసి మందులను ఉచితంగా అందిస్తున్నారని, ప్రతి గ్రామంలో సగటున రోజుకు 45 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కదలలేని స్థితిలో వున్న రోగుల ఇళ్లకే వెళ్లి వైద్య పరీక్షలు అందిస్తున్నారని వివరించారు. ప్రజలకు మండల కేంద్రాలకు రాకుండానే గ్రామాల్లోనే వారికి అవసరమైన అన్ని ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా అందించడంతో పాటు, ధాన్యం కొనుగోలు, పంటల నమోదు, పంటల బీమాతో పాటు ఇతర సంక్షేమ పధకాలను అందిస్తున్నా మన్నారు. గ్రామ స్థాయిలో వున్న ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటి ముంగిటకు అందిం చాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష అనే పేరుతో సచివాలయాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు జూన్‌ 23 నుండి నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 50 శాతం సచివాలయాలకు అధికా రులు వెళ్లి ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవల ధ్రుపత్రాలను అందిస్తున్నారని తెలిపారు.