కూరగాయలు దైనందిన జీవితంలో వాడే అతి ముఖ్యమైన ఆహారపంట. ఎలాంటి రసాయనాలు, క్రిమీసంహారక మందులు వాడకుండా సహజసిద్ధంగా వాటిని ఇంట్లో పెంచుకోవడం ఎవరికి ఇష్టముండదు? కూసింత జాగాల్లోనూ, కుండీల్లోనూ పెంచుకునే కలర్‌ఫుల్ కూరగాయల మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం
ఈ కూరగాయలు సాధారణ కూరగాయలతో పోలిస్తే విభిన్న రంగుల్లోనూ, రూపుల్లోనూ కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఇటు రమణీయత, అటు కూరల పంట ఇస్తున్న ఇంటి మొక్కలను కొన్నింటి గురించి తెలుసుకుందాం.
అమెరికన్ పుట్టగొడుగు..
పుట్టగొడుగుల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం పెరిగింది. ఒకప్పుడు వర్షాకాలంలో చిత్తకార్తి సీజన్లో పుట్ట ప్రాంతాల్లో, వరి గడ్డిమేట్ల వద్ద, పొలంగట్ల మీద సహజంగా పెరిగేవి. వీటిలో కొన్ని విషపూరితమైనవీ ఉంటాయి. కాబట్టి అన్నింటినీ తినరు. అవసరాన్ని బట్టి ప్రత్యేక పరిస్థితుల్లో స్పాన్ తయారుచేసి, మార్కెట్లో కృత్రిమంగా తయారుచేస్తారు. ఈ పంట కేవలం 60 రోజుల్లోనే చేతికొస్తుంది. వీటిలో అమెరికన్ పుట్టగొడుగు ఒక రకం. ఇర్గోథియోనైన్, సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇంకా మధుమేహాన్ని అదుపు చేస్తుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, విటమిన్- సి ఉండి, రక్త కణాల ఆరోగ్యానికి సహాయపడతాయి.
గుడ్డు వంగ..
పోషక పదార్థాలు మెండుగా ఉన్న కూరగాయలు వంగ. ఇది తెలుగు వారి పసందైన వంటకాల్లో ఒకటి. వంకాయల్లో చాలా రకాలున్నాయి. వాటిలో అధునాతనమైంది కోడిగుడ్డు వంగ. ఇది కుండీల్లో చక్కగా పెరిగి, నిగారింపుగా కాయలు కాస్తుంది. కాయలు ఆకారంలోనూ, పరిమాణంలోనూ ఇవి అచ్చంగా కోడిగుడ్లను పోలి ఉంటాయి. పాల తెలుపుతో నిగనిగలాడటం వీటి ప్రత్యేకత. కాయలు చిన్నగా ఉన్నా, రుచిలో మధురంగా ఉంటాయి. ఈ జాతి కాయలకు పుచ్చు పట్టే స్వభావం తక్కువ. వీటిని ఇంట్లో కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
ఎర్ర బెండ..
బెండలోనూ ఎన్నో పోషక విలువలుంటాయి. వీటిలోని గుజ్జు, పీచు పదార్థానికి ఔషధ గుణాలుంటాయి. వీటిలో కొత్తరకం మొక్క ఎర్ర బెండ. మొక్క నాటిన నాలుగు నెలలకే కాయలు కాస్తుంది. కుండీల్లోనూ పెరుగుతుంది. వీటి కాయల మీద నూగు కాస్త తక్కువగానే ఉంటుంది. ఎర్రబెండ కూర ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా బెండలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్- సి లాంటివి ఉంటాయి.
పర్పుల్ టమోటా..
కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రొటీన్, బీటా కేరోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ - సి వంటి పోషకాలుండే కూరగాయలు టమోటాలు. సోలనం లైకోపెర్సికం మొక్క యొక్క తినదగిన బెర్రీ టమోటా. దీనిలో పర్పుల్ టమోటా అధునాతన రకం. వీటి కాయలు నిగనిగలాడుతూ, లోపలి గుజ్జు కూడా అదే రంగులో ఉంటుంది. మామూలు టమోటాలా పుల్లగా కాకుండా, ఇది కాస్త తియ్యగా ఉంటుంది. దీన్ని కూరల్లో వేస్తే రుచి గమ్మత్తుగా ఉంటుంది. కుండీల్లోనూ ఇవి బాగానే కాపు కాస్తాయి. మొక్క రెండడుగుల లోపే పెరుగుతుంది. నీటి వనరు పెద్దగా అవసరం లేదు.
భలే బాటిల్ గార్డు..
పోషకాలు, పీచు, పిండి పదార్థం, నీరు మెండుగా ఉన్న కూరగాయల్లో ఆనపకాయ ఒకటి. ఇది బాటిల్ ఆకారంలో ఉండటంతో బాటిల్ గార్డు అని పిలుస్తారు. పాము బూర ఆకారంలో ఉండే ఈ ఆనపకాయ భలే వింతగా ఉంటుంది. కాయ కొంతభాగం పొడవుగా ఉండి అడుగున బుడగలా ఉంటుంది. తీగలకు వేలాడే ఈ సరికొత్త ఆనపకాయలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ కాయలు కూరలో ఎలా వాడినా రుచే.
రంగుల కాలిఫ్లవర్..
కూరల్లో పోషకాల నిధి కాలిఫ్లవర్. దీని శాస్త్రీయనామం బ్రసికా ఒలెరాసియా. విత్తనాల ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. మొక్కకు మధ్యభాగంలో పువ్వుల ద్వారా పంట పండుతుంది. వీటిలో పీచు పదార్థం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ సంవృద్ధిగా ఉంటాయి. శరీర నిర్మాణానికీ, పెరుగుదలకు, శక్తికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పసుపు, పర్పుల్, ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులతో సరికొత్త హైబ్రీడ్ కాలిఫ్లవర్‌లూ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో తెలుపు కాలిఫ్లవర్ కంటే 25 శాతం పోషక విలువలు అధికం. పైగా కుండీల్లోనూ చక్కగా పెరిగి, కాపు కాస్తుంది. గుల్లగా ఉన్న నల్లమట్టిలోనైతే మరింత బాగా పెరుగుతుంది. రజూ కొద్ది కొద్దిగా నీరు పోస్తుండాలి.
ఎల్లో మిర్చి..
కారంగా ఉండే పచ్చిమిర్చిలోనూ చాలా పోషక విలువలున్నాయి. విటమిన్ -ఎ, విటమిన్- సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్‌లాంటి పోషకాలు పచ్చిమిర్చిలో ఉంటాయి. ఈ జాతికి చెందిన క్యాప్సికమ్‌లో మాత్రమే మనం రంగులను చూశాం. ఇప్పుడు ఇళ్లలో పెంచుకునే టేబుల్ చిల్లీస్‌లోనూ చాలా రంగులు వచ్చాయి. వాటిలో ఎల్లో మిర్చి కాస్త ముందు వరుసలో ఉంటుంది. బాగా కారంగా ఉండే ఈ రకం సంవత్సరం పొడుగునా కాపు కాయడం విశేషం.
తెల్ల కాకర..
ఎన్నో పోషకాలున్న కూరగాయ తెల్ల కాకర. ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మనం ఇప్పటివరకూ ఆకాకర కాయ గురించి విన్నాం. కానీ ఈ తెల్ల కాకర అధునాతన రకం. చిన్న జాగాల్లోనూ చక్కగా తీగల్లాగా ఎగబాకి, తెల్లటి కాకరలను కాస్తుంది.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506