Sep 21,2023 23:49

కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప



కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప
ప్రజాశక్తి- తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈవాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుండి గోదాదేవి మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దగల శ్రీ పెద్దజీయర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ సెల్లదొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈవో ముత్తురాజ, ట్రస్టుబోర్డు సభ్యుడు మనోహరన్‌ కలిసి ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈసందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలను తిరుమల శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వీటిని గరుడసేవలో స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు.
భూదేవి అవతారం గోదాదేవి
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీగోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ స్థానాచార్యులు రంగరాజన్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.