ప్రజాశక్తి-యలమంచిలి
అత్యంత విలువైన కూరగాయల మార్కెట్ స్థలాన్ని అభివృద్ధి చేసి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి మున్సిపల్ ఆదాయం పెంపు లక్ష్యంతో చట్టవిరుద్ధంగా మార్కెట్ షాపుల్ని 2018లో కూలగొట్టారు. మార్కెట్ వ్యాపారులు హైకోర్టుకు వెళ్లి ఇది చట్ట విరుద్ధమంటూ వాదిస్తే అందులో కీలక పాత్ర పోషించిన నాటి మున్సిపల్ కమిషనర్ కనకరాజు సస్పెండయ్యారు. ఇదొక కథ. షాపులను కూలిగొట్టిన సమయంలో కూరగాయల షాపుల కలపను కొత్తగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసులో భద్రపరిచారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కొత్త కార్యాలయం ముస్తాబు సమయంలో అక్కడ దాచిన కలప మాయమైంది. దీని గురించి కార్యాలయ సిబ్బంది ఎవర్ని ప్రశ్నించినా సరైన జవాబు రాలేదు.
విలువైన కలప కావడంతో దాని గురించి ప్రజాశక్తి పరిశోధించగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది చేసిన లీకుల మూలంగా తేలిన అంశం ఏమిటంటే ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ ట్రాక్టర్లలో కలపంతా తరలించినట్లు తెలిసింది. అది కూడా ఒక కౌన్సిలర్ ఆదేశాలతో జరిగిందంటున్నారు. అది కాస్తా పోలీసులు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో కూడా నమోదైనట్టు భోగట్టా. కలప మాయమైన విషయమై మున్సిపాలిటీలో ఎవర్ని ప్రశ్నించినా సరైన జవాబు చెప్పడం లేదు. అయితే ఎర్రవరం సంపు ప్రాంగణంలో కొంత కలప ప్రజాశక్తి దృష్టికి వచ్చింది. ఇక్కడకు ఎలా వచ్చిందని అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా అక్కడకు తరలించిన కౌన్సిలర్ పేరు విస్పష్టంగా చెప్పారు. మిగిలిన కలప గురించి వాకబు చేయగా ఆ కౌన్సిలర్ చైర్మన్‌గా ఉన్న పాఠశాల మధ్యాహ్న భోజనం తయారీదార్లకు అందజేసినట్లు తెలిసింది. కోర్టు కేసులో ఉన్న కలప తరలింపు సంగతి న్యాయ నిపుణుల్ని ప్రశ్నించగా అది ముమ్మాటికీ క్రిమినల్ చర్య అని పేర్కొన్నారు. కలప మాయమైన సంగతి మరెక్కడకు దారి తీస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మున్సిపల్ ఇంజనీర్ వీరయ్య వివరణ
ఇదే విషయమై మున్సిపల్ ఇంజనీర్ వీరయ్యను వివరణ కోరగా.., కలప తరలించిన సంగతి వాస్తవమేనని, సంపు ప్రాంతంలో కొంత, బస్టాండ్ ఓవర్‌హెడ్ ట్యాంకు కిందనున్న తాళం వేసిన స్టాక్ రూమ్‌లో కొంత సరకు ఉందని తెలిపారు. ఓవర్‌హెడ్ ట్యాంకు స్టాక్ రూమ్ పరిశీలించగా ఎటువంటి కలప లేకపోవడం కొసమెరుపు.










