అనంతపురం కలెక్టరేట్ : గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలందరికీ న్యాయం జరిగేంత వరకు ఐక్యంగా పోరాడుదామని అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు పిలుపునిచ్చారు. కల్లూరు గ్రామంలో గుడిసెలు తొలగించిన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు జెఎం.బాషా, ఎస్సీ, ఎస్టీ సంఘాల జెఎసి అధ్యక్షులు సాకే శ్రీహరి, ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు, పుల్లప్ప, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ముస్కిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో దాదాపుగా ఉన్న ఇళ్ల స్థలాలన్నీ లక్ష్మీ నరసింహస్వామి దేవుని మాన్యం భూములే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టేడియం, పాఠశాల నిర్మాణానికి భూముల కేటాయింపు జరిగిందన్నారు. ఆ భూముల్లో నేడు ఇళ్ల నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ధనవంతులు, పలకుబడి ఉన్నవారందరూ ఇళ్లు నిర్మించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. వాళ్లెవరినీ పట్టించుకోకుండా సెంటు స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం అత్యంత దుర్మార్గం అన్నారు. పేదల పక్షాన ప్రశ్నించడానికి వెళ్లిన సిపిఎం నాయకులపై సిఐ నరేంద్రరెడ్డి చేయిచేసుకోవడం హేయమైన చర్య అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా కమ్యూనిస్టు పార్టీలు, నాయకులు పని చేస్తారనే విషయాన్ని వారు తెలుసుకోవాలని సూచించారు. సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న మాట్లాడుతూ పోలీసులే రౌడీళ్లగా వ్యవహరించి పేదల గుడిసెలు తొలగించడం దుర్మార్గంగా ఉందన్నారు. గుడిసెల తొలగింపు అప్రజాస్వామిక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ పేదలను నడిరోడ్డుపై పడేశారని మండిపడ్డారు. అధికారులు వైసిపి కార్యకర్తల్లాగా వ్యవహరిస్తే ఎలాని ప్రశ్నించారు. సిఐ నరేంద్ర రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా మాట్లాడుతూ కల్లూరులో గుడిసెలు వేసుకున్న వారంతా దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పేదలే అన్నారు. వారికి నిలువ నీడ లేకుండా చేయడం సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నారాయణస్వామియాదవ్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా పేదలపై అధికారం దుర్వినియోగం పాల్పడటం సరికాదన్నారు. ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టి గుడ్డలూడదీసి కొట్టే పరిస్థితిని పోలీసులు తెచ్చుకోవద్దన్నారు. టిడిపి మైనార్టీ నాయకులు జెఎం.బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే మాటలకు క్షేత్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలకు పొంతన లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జెఎసి ఛైర్మన్ సాకే శ్రీహరి మాట్లాడుతూ అనంతపురం నగరం అభివృద్ధి జరిగిందంటే కమ్యూనిస్టు పార్టీలు నగరానికి చుట్టు పేదలతో కాలనీ ఏర్పాటు చేయడంతోనే సాధ్యమైందన్నారు. అలాంటి నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గం భూ కబ్జాల పరంపర నిత్యం కొనసాగుతోందన్నారు. పేరుకు దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు అగ్రవర్ణాల వారు కావడంతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో పేదలు వేసుకున్న గుడిసెలు తొలగించరాదని హైకోర్టు తీర్పు ఉన్నా వాటిని భేఖారు చేస్తూ పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు గుడిసెలు తొలగించారని తెలిపారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు దేవాదాయ శాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించి పేదలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఆలయ భూములను వైసిపి నాయకులు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడ అన్యాక్రాంతం అయిన భూములన్నీ ఖాళీ చేయించే దమ్ము అధికారులకు ఉందాని ప్రశ్నించారు. సిఐ నరేంద్రరెడ్డి తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించి, కులం పేర్లతో దూషించి దాడి చేశాడన్నారు. ఆ అధికారిని సస్పెండ్ చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. కల్లూరులో బాధిత పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు కలెక్టర్ ఎం.గౌతమి, ఎస్పీ కెకెఎన్.అన్బురాజన్‌లను కలిసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు ఆదినారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, నాయకులు ప్రకాష్, గుడిసెలు కొల్పోయిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.










