Jul 30,2023 20:52

కళ్ల కలతో ఆస్పత్రికి వచ్చిన రోగులు

ప్రజాశక్తి - కురుపాం : జిల్లాలోని పలు మండలాల్లో కళ్లకలకల విజృంభిస్తోంది. దీని బారిన ప్రతిరోజూ వందలాదిమంది పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే ప్రజలు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజుకు 50మందికి పైగా కళ్లకలకల బాధితులు వస్తున్నట్లు మన్యం జిల్లా కంటి వైద్య నిపులు జీరు నగేష్‌ రెడ్డి తెలిపారు. వాతావరణలో మార్పుల కారణంగా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం చివరి దశలో ఎండలు, వానల కారణంగా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కళ్లకు కండ్ల కలకల వ్యాధి ఎక్కువగా వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి కంటి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే తొందరగా నయం చేయవచ్చు. కళ్ల కలకల వల్ల ప్రమాదం లేకపోయినా అప్రమత్తంగా ఉండడం అవసరమని చెప్పారమని, సొంత వైద్యం కాకుండా కంటి వైద్యనిపుణుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
వేగంగా వ్యాప్తి...
ఇది ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలవకుండా కనీసం వారం రోజులపాటు ప్రత్యేకంగా ఒక గదిలో ఉండాలి. కళ్ల కలకసోకిన వ్యక్తి తాకిన వస్తువులను ఇతరులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధిని కొంతవరకు నివారించొచ్చు. కళ్ల కలక సోకిన వారు తరచూ కళ్లను తాకాల్చి వస్తుంది. అలా తాకిన ప్రతిసారి చేతులు శుభ్రం చేసుకోవాలి.

లక్షణాలు
కంటి నుంచి విపరీతంగా నీరు కారడం, కళ్లు ఎర్రబడడం, రెప్పలు అంటుకుపోవడం, విపరీతంగా పుసులురావడం, మంట పుట్టడం, కంటిలో ఇసుక పడినట్లు గుచ్చుకోవడం తదితర లక్షణాలుంటే నేత్ర వైద్యులు సంప్రదించాలి. గతంలో కరోనా బారిన పడిన వారిలో ఈ వ్యాధి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. కంటి గుడ్డి చుట్టూ తెల్లని పొరరెప్పలా వెనుక ఉండే పొరను కంపెనైనా అంటారు. దుమ్మూ, ధూళి, వేడి నీరు, అధిక గాలి కంటి పొరలను తాకితే శరీరంలో సున్నిత భాగమైన కన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. సున్నితమైన అవయవాలు కావడంతో వేగంగా ఇన్ఫెక్షన్‌ బారిన పడే అవకాశం ఉంది. కళ్లు ఎర్రగా మారుతాయి. ఒక కంటికి కానీ కొందరికి రెండు కళ్లకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్‌ కారణంగా కణజాలంలో చేరిన బాక్టీరియా వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.
జాగ్రత్తలు....
కళ్ల కలకల బారిన పడినవారు కంటిని తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మెత్తటి గుడ్డతో కంటి భాగాన్ని ఒత్తిడి తగలకుండా తుడుచుకోవాలి. తరచూ శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇంటి నుండి బయటకు రాకుండా గదిలోనే ఉండాలి. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉండాలి. వారం రోజుల్లోపు తగ్గకపోతే తప్పని సరిగా నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలి. నవజాత శిశు వు కండ్ల కలక సోకితే ప్రమాదకరం. కండ్ల కలక బాధితులు చిన్నారులకు దూరంగా ఉండాలి. పాఠశాలలు, ప్రజలు ఎక్కువగా గుమ్మి కూడిన ప్రదేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
ఆందోళన వద్దు
వర్షాకాలంలో ఎక్కువగా ఈ అంటువ్యాధి కనిపిస్తుంది. క్రిములు కారణంగా ఇది వ్యాపిస్తుంది. కొన్ని రోజుల్లోనే తగ్గుముఖం పట్టినా జాగ్రత్తలు తప్పనిసరి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నారులకు సోకితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సూచన మేరకే చుక్కల మందు వేయించుకోవాలి.
జీరు నగేష్‌ రెడ్డి
నేత్ర వైద్య అధికారి , జిల్లా కంటి వెలుగు విభాగం.

వైద్యులను సంప్రదించాలి
జిల్లాలో కండ్లకలక వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి అశ్రద్ధ వహించకుండా నేత్ర వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్సలు, జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదం వుండదు. జిల్లాలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
డాక్టర్‌ బి. జగన్నాథరావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,