ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ధాన్యం కొనుగోలు
దళారులను అరికట్టడం సాధ్యమేనా
సర్కార్ ప్రణాళికలు ఆచరణకు సాధ్యం కాదంటున్న మిల్లర్లు
తేమశాతం నిబంధనల సడలించాలి : రైతులు
మద్దతు ధర కల్పించి, సకాలంలో సొమ్ములివ్వాలని డిమాండ్
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
కొత్త సీసాలో పాత నీరు పోసిన విధంగా ఉంది సర్కారు తీరు. ఏటా ఇబ్బందులతో మొదలవుతూ.. ఇబ్బందులతోనే ముగుస్తున్న ధాన్యం కొనుగోలు విషయంలో సర్కారు పాతమాటనే కొత్తగా చెప్పుకొచ్చింది. రైతు కల్లంలోనే ధాన్యం కొనుగోలు విషయంలో దళారుల, మిల్లర్ల పాత్ర లేకుండానే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అంటూ కొత్తగా చెప్పుకొచ్చింది. కానీ ఎప్పటిమాదిరిగానే ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారి ఖాతాల్లో నగదును జమ చేస్తామని చెప్పడం గమనార్హం.
ఏటా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగక ముందే రైతుల వద్దనున్న ధాన్యాన్ని దళారులు, పలువురు మిల్లర్లు తమ అడ్డాలోకి తరలించుకుపోవడం ఆనవాయితీగా వస్తోంది. సర్కార్ చెప్పిన మాదిరిగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు పడినా వాటిని తీసుకునే హక్కు వారికి ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అప్పటికే నగదు విత్ డ్రా ఫారంపై రైతు సంతకం/వేలిముద్ర తంతు పూర్తయి పాస్‌బుక్‌తో సహా దళారులు, పలువురు మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఏటా మళ్లీమళ్లీ మిల్లర్ల వద్దకే చేరుతున్న బియ్యాన్ని మరపట్టి తిరిగి లెవీగా సర్కారుకే మిల్లర్లు చేరవేస్తున్నారు. రైతుల వద్దనుంచి సేకరించిన ధాన్యాన్ని ఆరునెలల వరకూ నిల్వ ఉంచి ఆ తర్వాత వాటిని ఆడించి బహిరంగ మార్కెట్‌లో అధికధరకు విక్రయించుకుంటూ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా సర్కారుకు తెలిసే జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినిట్లు వ్యవహరిస్తుంది. ఈ ఏడాది 3.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దానికిగానూ ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో సేకరించడానికి జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం వల్ల ఆఖరి నిమిషం వరకూ ఏ రైతుకు చెందిన ధాన్యం ఏ మిల్లుకు చేరుతుందో? తెలియదని, దానివల్ల రైతులు దళారుల బారిన పడకుండా ఉంటారని చెప్పారు. దీనికి సంబంధించి ప్రత్యేకసెల్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేకించి అధికారుల బృందాన్ని కూడా నియమించారు. ఈ ధాన్యం సేకరణకుగానూ మిల్లర్ల వద్ద 50 లక్షల గోనెసంచులు, మరో పదిలక్షలు పౌరసరఫరాల వద్ద సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొనుగోలు పురోగతిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయ వర్గాలు పరిశీలిస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి ధాన్యం నేరుగా వే బ్రిడ్జికి వెళుతుందని అక్కడ నుంచి ర్యాండమ్ పద్ధతిలో కేటాయించిన రైస్ మిల్లుకు ధాన్యం చేరుతుందని, మిల్లర్లకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ విషయంలో ఉన్నతస్థాయి అధికారులతో చర్చించామని, సానుకూల దృక్పధం వచ్చిందని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే తేమ శాతం 17 కంటే తక్కువ ఉండాలని, పొలంలో రైతు ఆరబెట్టిన ధాన్యాన్ని సేకరించి వే బ్రిడ్జికి తీసుకువెళ్లి తూకం వేసి ఎఫ్‌టిఒ జనరేట్ చేస్తారు. అక్కడ నుండి ఆయా రైస్ మిల్లులకు ధాన్యం రవాణా అవుతుంది. ఈ విషయంలో వాలంటీర్ రైతు సహాయకుడిగా పనిచేస్తారు. అయితే ఇప్పటికే ప్రతీ మండలంలో వే బ్రిడ్జిలను అధికారులు గుర్తించారు.
నిబంధనలు సడలించాలి
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంలో కొన్ని నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా పరిణమించాయి. తేమశాతం 17 మించకుండా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదిసాధ్యం కాదు. ఈ నిబంధనను సడలించాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రతీసారి ధాన్యం కొనుగోలులో రైతులను గోనె సంచుల కొరత వెంటాడుతోంది. ఈ సారైనా సరిపడు గోనె సంచులను రైతులకు అందించాలని కోరుతున్నారు.
సకాలంలో సొమ్ములు అదేనా?
ధాన్యం సొమ్ముల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతన ఉండటం లేదు. ధాన్యం సేకరించిన 21 రోజుల్లో సొమ్ములను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఇది ఎక్కడా కూడా అమలుకావడం లేదు. నెలల తరబడి ధాన్యం సొమ్ములు పెండింగ్‌లో పెట్టిన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఎప్పటిలాగానే ఈ ఖరీఫ్‌లోనూ 21 రోజుల్లో సొమ్ములు కచ్చితంగా జమ చేస్తామని చెబుతున్నారు. ఏది ఏమైనా రైతులు అమ్మిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి సకాలంలో సొమ్ము చెల్లించాలని కోరుతున్నారు.
దళారులను నిరోధించగలరా..?
అయితే ఇదంతా బాగానే ఉన్నా దళారులను నిరోధించగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా అధికారులు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ప్రకటనలు చేసినా దళారులు మాత్రం తమదైనరీతిలో రైతులను నిలువునా మోసం చేస్తున్నారనే విషయం తెలిసిందే. చాలామంది రైతులు సాగు చేయడానికి అధికమొత్తంలో వడ్డీకి పెట్టుబడిని తీసుకొస్తుంటారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి నగదును జమ చేయడంలో జాప్యం జరుగుతుండడం పరిపాటిగా మారుతోంది. దీంతో రైతులు అందినకాడికి దళారులకు అమ్ముకుని ముందుగానే డబ్బులు తీసుకుని అప్పులు చెల్లించుకోవడం పరిపాటిగా మరుతోంది. మరి ఇలాంటి తరుణంలో ఈసారి అటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే రైతులకు అనుకున్న సమయానికి నగదును వారి ఖాతాల్లో జమ చేయాలని పలువురు చెబుతున్నారు.
ధాన్యం సేకరణలో నూతన విధానం.. నష్టం
ధాన్యం సేకరణలో నూతన విధానం వల్ల సొసైటీలు నష్టాల్లోకి వెళ్తాయని ఇటీవల జరిగిన జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ కార్యవర్గ సమావేశం పేర్కొంది. సహకార సంఘాలు నష్టాల్లోకి వెళ్తాయని, కొత్త నిబంధనల వల్ల కార్యదర్శికి పూర్తి బాధ్యత ఇవ్వడంతో ఏదైనా పొరపాటు జరిగితే పోలీసులు కేసులు బనాయిస్తారని, కార్యదర్శులు ఆందోళన చెందుతారని వివరించింది. అలాగే నిర్మించిన గోదాములు 30 సంవత్సరాల్లో 30 వాయిదాల్లో బాకీ తీర్చాలి, తరువాత గోదామును ప్రభుత్వానికి అప్పగించాలి, ఈ గోదాములపై సహకార సంఘాలకు ఏ విధమైన హక్కులుండవు ఇది కేవలం సహకార సంఘాలను నష్టాల్లోకి నెట్టి వేయడం తప్ప మరొకటి కాదని తెలుస్తోంది.










