Apr 19,2023 21:11

విద్యార్థుల ఎదుట మ్యాజిక్‌ను ప్రదర్శిస్తున్న క్రాంతికార్‌

ప్రజాశక్తి-తాడేపల్లి : వందలాది మంది విద్యార్థుల కేరింతలు, చప్పట్లు మధ్య కుంచనపల్లి అరవింద హైస్కూల్లో ప్రముఖ ఇంద్రజాలికులు క్రాంతికార్‌ మ్యాజిక్‌ డెమో కార్యక్రమం బుధవారం విజయవంతంగా జరిగింది. మండుతున్న క్లాత్‌ నుంచి రోజా పువ్వు తెప్పించడం, చేతిలో ఉన్న కుందేలు బొమ్మ ఉన్నట్టుండి పుచ్చకాయ బద్దగా మారిపోవడం, ఒకే రకమైన మూడు పేక ముక్కలు ముగ్గురు విద్యార్థులకు మూడు రకాలుగా కనిపించడం, ఆకుపచ్చ కాయ నుండి బ్లూ రంగు వస్త్రాన్ని తెప్పించడం తదితర 12 రకాల మ్యాజిక్‌ను చూసిన చిన్నారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్‌ సిహెచ్‌.పద్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రాంతికార్‌ లాంటి ఇంద్రజాలికులు అరవింద హైస్కూల్‌కు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. వచ్చేనెల 5-14వ తేదీల్లో జరిగే శిక్షణలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మ్యాజిక్‌కు సంబంధించి మెటీరియల్‌ కోసం రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా క్రాంతికార్‌కు జ్ఞాపికను అరవింద విద్యార్థులు తమ సృజనాత్మకతతో రాసిన పుస్తకాలను అందజేశారు. మంగళగిరి- తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగడంతోపాటు ప్రశ్నించేతత్వం అలవడుతుందని అన్నారు.
బాలోత్సవం న్యాయనిర్ణేతలకు జ్ఞాపికలు
మంగళగిరి-తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో గతనెల 22వ తేదీన అరవింద హైస్కూల్లో జరిగిన ఉగాది బాలోత్సవంలో పాల్గొన్న న్యాయనిర్ణేతలకు జ్ఞాపికలను అందజేశారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ బాలోత్సవం నిర్వహణకు అవకాశం కల్పించిన హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ బి.ఇంద్రాణికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరవింద హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మందారపు అనురాధ పాల్గొన్నారు.