Aug 22,2021 12:48

కళ్ళలో ఒక నది ఒక చెట్టు
ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి.
లోపలి మనిషి ఒక్కోసారి
బహిర్గతమౌతుంటాడు.

అంతర్ధానమౌతున్న విలువల ముందు
జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా
కడగబడుతున్న క్షణాల్లో
ఇంకో పార్శ్వముగా
దివ్య రేఖలు అద్దుతుంటాయి.

చెదిరిపోని ఊహలు
గూళ్ళను నిర్మిస్తాయి.
అల్లుకున్న తపనలు
చిగురులు తొడుక్కుంటాయి.

ఒక దాహం నది తీర్చినట్లు
ఒక ఎండని చెట్టు ఆపినట్లు
కాలం దొంతరల్లో
ఒక ప్రయత్నం
ఎన్నో కాంతుల్ని విసురుతుంది.

శ్రమ ఉదయించడంలో
విజయాలు తడుతుంటాయి.
అక్షరాల కాంతిలో
ఇలా రేపటి స్వప్నాలని
నిర్మించుకుంటూ ..

అడవి పూల సౌందర్యాన్ని
పారే నదీ ప్రవాహాల్ని
చెట్టున వాలే పక్షుల్ని
నాలో ఊహల్నీ
ప్రవహించే కాలం ముద్రిస్తుంది ..!

గవిడి శ్రీనివాస్‌
70192 78368