
ప్రజాశక్తి - భీమవరం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కళ్ల కలక విజృంభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో గంటల వ్యవధిలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. హాస్టళ్లు, స్కూళ్లలో కళ్ల కలక బారిన పడిన చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో మార్పులు, రసాయనాలు, వాహనాల పొగ, సౌందర్య ఉత్పత్తుల వాడకం, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు, పుప్పొడి వల్ల కళ్ల కలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో చిన్నారులే అత్యధికం. జిల్లాలో అనేక పాఠశాలల్లోని చిన్నారులు ఈ వ్యాధి బారినపడ్డారు. కళ్ల కలక బాధితుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఒపి సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ వ్యాధి బారిన పడుతున్నారు. పాఠశాలల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకుతుంది. అలా వారి తల్లిదండ్రులకూ వ్యాపిస్తోంది. ఈ వ్యాధితో ప్రభుత్వ ఉద్యోగులు సైతం సెలవులు పెడుతున్న పరిస్థితి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది ఔషధ దుకాణాల్లో దొరికే చుక్కల మందు వినియోగిస్తున్నారు. కొద్ది రోజులుగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కన్పిస్తోంది. ఇది సోకితే కళ్లలో మంట, దురదతోపాటు కళ్ల చుట్టూ వాపు వస్తోంది. చిన్న పిల్లలు కళ్లను నలపడం వల్ల లోపలి భాగంలో తెల్లటి పొర, వెనుక భాగంలో ఉండే కంజంకైవా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే కళ్ల కలకలు గణనీయంగా పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు బ్యాక్టీరియా రసాయనాల వంటి కారణాలతో ఇది మరింత వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదని నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.
కళ్ల కలక అంటే ఏమిటి?
కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరను కండెటైవా అంటారు. కళ్లు తెరచి ఉండటంతో దుమ్ము ధూళి, వేడి, చలి, నీళ్లు ఏదైనా ప్రభావం చూపించొచ్చు. దీంతో ఇన్ఫెÛక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దానినే కళ్ల కలక అంటాం.
కళ్ల కలక ప్రమాదకరమా.. ఎవరికి.. ఎందుకు..?
మాములుగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించిన కళ్ల కలక వారం రోజుల్లో తగ్గిపోతుంది. అయితే వైరస్ వల్ల సంక్రమించింది మూడు వారాల వరకు ఉంటుంది. నెలల పిల్లలకు లేదా రోజుల పసి పిల్లలకు ఇది కొంచెం ప్రమాదకరం. కళ్లకలక లేదా కంజక్టివిటీస్ ముదిరి తెల్లకన్ను గుడ్డు పక్కన ఉండే నల్ల గుడ్డు (కార్నియా) మీద ప్రాణి కెరటయటిస్‌గా మారి అది తగ్గాక చిన్న లేదా పెద్దగా తెల్ల మచ్చలు ఏర్పడుతాయి దీనినే కార్నియల్ స్కార్స్ అంటారు. దీని ద్వారా చూపు మందగిస్తుంది. కొందరిలో ఈ కార్నియా పూర్తిగా అలసర్ (తెల్లటి మచ్చ) అయ్యి చిన్న రంధ్రం ఏర్పడి పూర్తిగా చూపు పోయే ప్రమాదం ఉంది.
కళ్ల కలక లక్షణాలు..
కన్ను ఎర్రగా మారడం, కంటి నుండి నీరు కారడం, కంటి రెప్పలు వాపు లేదా ఉబ్బిపోవడం. నిద్రపోయినప్పుడు కళ్ల రెప్పలు అంటుకుపోవడం. కంటి నుండి పుసి రావడం. కంటి నొప్పి, దురద, మంట వంటి లక్షణాలు ఉంటే కళ్ల కలక వచ్చినట్లు నిర్థారించుకోవాలి.
కళ్ల కలకకు చికిత్స ఇలా
కళ్ల కలక వస్తే ఆందోళనకు గురికాకుండా చికిత్స చేయించుకోవచ్చు. మార్కెట్లో కూడా ఈ కళ్ల కలకకు సంబంధించి అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కళ్ల కలక వచ్చినవారు యాంటీ బయోటిక్ ఐ డ్రాప్స్, లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, అరుదైన పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు తీసుకోండిలా
మన పరిసరాల్లో (కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థలు) ఎవరికైనా కళ్ల కలక సోకితే వారికి కొంచెం దూరంగా ఉండటం తప్పనిసరి. వారు వాడిన వస్తువులు టవల్స్, సబ్బులు వంటివి తాకరాదు. పొరపాటున ముట్టుకున్నా తరచూ నీటితో చేతులను శుభ్రపర్చుకుంటూ ఉండాలి. కళ్ల కలక వస్తే కళ్లద్దాలు వాడటం చాలా అవసరం.
కళ్ల కలక సాధారణ కంటి జబ్బు..
సిహెచ్‌వి.రంగమనాయుడు, పిహెచ్‌సి వైద్యులు, పాలకోడేరు
కళ్ల కలక అనేది చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దానిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా తగు జాగ్రత్తలు పాటిస్తూ కళ్లను మంచి నీటితో శుభ్రపర్చుకుంటూ ఉంటే అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి. మండలంలోని అన్ని పిహెచ్‌సిలు, సబ్ సెంటర్లలో ఐ డ్రాప్స్ అత్యధిక మోతాదులో అందుబాటులో ఉన్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయే కళ్ల కలక పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి.