
కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న రుషిల్ డెకార్ కార్మికులు
ప్రజాశక్తి-అచ్యుతాపురం
తమకు పనులు కల్పించాలని కోరుతూ గత 12 రోజులుగా పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న రుషిల్ డెకార్ ప్లైవుడ్ పరిశ్రమ ముఠా కార్మికులు ఆదివారం కళ్లకు నల్ల రెబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలను పట్టించుకోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరి నిరసనకు సిఐటియు, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము మాట్లాడుతూ 2019 నుండి ఇస్తున్న కూలి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రుషిల్ డెకార్ యాజమాన్యం కుమ్మక్కై నిర్వాసితుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ ముఠా కార్మిక సంఘం నాయకులు సత్తిబాబు, అప్పలనాయుడు, నాగేషు తదితరులు పాల్గొన్నారు.