ప్రజాశక్తి-పాడేరు:ఐటిడిఎ పీవో గోపాల కృష్ణను తక్షణమే సరెండర్ చేయాలని, గిరిజన విద్యార్థుల మరణాలపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం 10వ రోజు కొనసాగాయి. ప్రజా సంఘాల వేదిక నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరుద్యోగుల సంఘం అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ, విద్యార్థి, ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు నిరుద్యోగుల సంఘం, భాష వాలంటీర్లు సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏ గేటు ఎదుట 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్పటికీ కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేని పాడేరు ఐటీడీఏ పిఓను తక్షణమే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. పెదబయలు తహసీల్దార్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. పీవోను రక్షించడం కోసం అమాయక ఉద్యోగులను బలి చేయడం సరికాదని, వారి సస్పెండ్‌ను తక్షణమే ఎత్తి వేయాలన్నారు.గిరిజన ప్రాంతంలో విద్యార్థుల వరస మరణాలపై హైకోర్టు సెట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థి, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులను గిరిజన విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్కులర్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిఒను సరెండర్ చేసేంత వరకు ఉద్యమం ఆపేది లేదని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ కూడ రాధాకృష్ణ. కో కన్వీనర్లు మువ్వాళ లక్ష్మణరావు, చిన్నారావు, కాదేలి చంటిబాబు, బత్తిరి నరేష్, భాష వాలంటీర్లు సంఘం సభ్యులు కె.క్రిష్ణ, కె.లచ్చన్న, జి. మత్యరాజు, సీదేరి జ్యోతి, పూజారి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.










