ప్రజాశక్తి-కలెక్టరేట్ : జీతాలు చెల్లించాలని, అక్రమ బదిలీలు ఆపాలని గురువారం డిఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. బదిలీలతో కేడర్ స్ట్రెంగ్త్ సమస్య వల్ల ఉపాధ్యాయుల జీతాలు చెల్లించక పోవడం, బదిలీలు జరిగిన 15 రోజుల తరువాత అక్రమ బదిలీలు చేపట్టడంపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళిమోహనరావు మాట్లాడుతూ ఉపాద్యాయుల జీతాలు చెల్లించుటకు నెలల తరబడి మీనమేషాలు లెక్కపెడుతున్న ప్రభుత్వం, ఒక్క రోజులోనే అనేక అక్రమ బదిలీల కోసం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ఇది కేవలం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యగానే భావించాల్సి వస్తోందన్నారు.
జిల్లా అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ బదిలీలలో ఖాళీలను బ్లాక్ చేశారని, వాటిని ప్రభుత్వ అనుకూలంగా ఉన్నవారికి ఇచ్చారని తెలిపారు. వేలాది మంది ఉపాధ్యా యులకు అన్యాయం చేసి కొద్దిమందికి లబ్ధి చేకూరే విధంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఖండించారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించి, అక్రమ బదిలీలు రద్దు చేయాలని జిల్లా కోశాదికారి మురళీ డిమాండ్ చేసారు. అనంతరం డిఇఒకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










