ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వైసిపిలో ఎట్టకేలకు పూర్తిస్థాయి జిల్లా కార్యవర్గాన్ని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ 43 మంది సభ్యులతో జిల్లా కమిటీని నియమించింది. ఈనెల 28వ తేదీన అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కూడా ప్రకటించారు. 2018 నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. 2018లో రెడ్డి శాంతికి పార్టీ పగ్గాలు అప్పగించినా కమిటీని నియమించలేదు. ఆ తర్వాత ప్రస్తుత శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సందర్భంలో అసంపూర్ణంగానే కమిటీని ఏర్పాటు చేశారు. 2021లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరిగిన సందర్భంలో అప్పటివరకు డిప్యూటీ సిఎంగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ అధ్యక్ష పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఆ సమయంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తప్ప ఇతర ఏ సంస్థాగత పదవులనూ భర్తీ చేయలేదు. రెండేళ్లుగా ఆ ఇద్దరితోనే నెట్టుకొచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం లేదని, పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదనే విమర్శలు రావడంతో నూతన కార్యవర్గర ఏర్పాటుకు నిర్ణయించింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ అవసరాన్ని గుర్తించింది. నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు పేర్లను పంపాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు సూచించిన తర్వాత వాటిని పరిశీలించి వడపోత అనంతరం కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎన్నికల టీమ్ అని కొందరు, ఎన్నికల రథసారథి దాసన్న అంటూ మరికొందరు కీర్తిస్తుండగా పార్టీ కేడర్‌లో మాత్రం మునుపటి ఉత్సాహం కొరవడిందన్న విమర్శలు సొంత పార్టీ నాయకుల్లోనే వినిపిస్తోంది. కొత్త కార్యవర్గం ఏర్పాటులో కొత్తదనమేముందంటూ పార్టీలో కొందరు నాయకులు పెదవి విరుస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండు మూడు పర్యాయాలు మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అందులోనూ కార్యకర్తలు తమ ఇబ్బందులను చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై కొందరు నాయకులు అంతర్గత చర్చల్లో మదనపడ్డారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల వరకు శ్రేణుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏడాది వరకు ఆ జోష్ కొనసాగింది. పంచాయతీలకు చెందిన నిధులు ప్రభుత్వం తీసుకోవడం, అధికారాలు, విధులు లేకుండా సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చడంతో వారిలో నిస్తేజం అలుముకుంది. గ్రామాల్లో చేపడుతున్న సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లను సర్పంచ్‌లతో పాటు ఎంపిటిసిలు, స్థానిక వైసిపి నాయకులు అప్పులు చేసి చేస్తున్న పనులకు డబ్బులు రాకపోవడంతో వారిలోనూ నైరాశ్యం నెలకొంది. వీరిని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయడం నూతన కార్యవర్గానికి పెద్ద సవాలే కానుంది.
వైసిపి అధిష్టానం జిల్లా కమిటిని ఏర్పాటు చేస్తున్నా, పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తున్న చర్యలు తీసుకోలేని స్థితిలో అధ్యక్షులు ఉన్నారు. రెండేళ్లుగా పార్టీ బాధ్యతలను చూస్తున్న ధర్మాన కృష్ణదాస్ ఒకట్రెండు సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని, గ్రూపులు కట్టే వారిపై ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని చెప్పినా అవి మాటలకే పరిమితమయ్యాయి. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీ రెండు, మూడు గ్రూపులుగా చీలింది. ముఖ్యంగా ఎచ్చెర్ల, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీల తీరుపై అసమ్మతిగళం వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ వ్యవహార శైలి గిట్టని వారంతా ఒకే తాటిపైకి వచ్చి అసమ్మతి గళం వినిపిస్తున్నారు. జగన్ ముద్దు, కిరణ్ వద్దంటూ ఏకంగా రోడ్డెక్కిన పరిస్థితిని మనం చూశాం. పాతపట్నం నియోజకవర్గంలోనూ సుమారు ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కొత్తూరు వైస్ ఎంపిపి తులసీ వరప్రసాద్, పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్ ముగ్గురూ పార్టీ తరుపున తిరుగుతున్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి, వైస్ ఎంపిపి తులసీ వరప్రసాద్ గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకుంటున్నారు.
మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గంలోనూ తీవ్ర అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రి ఒంటెత్తు పోకడలు, పదవుల పంపకాల్లో సీనియర్లకు అన్యాయం చేయడం వంటి చర్యలతో అసమ్మతిని మూటగట్టుకుంటున్నారు. మంత్రి వ్యతిరేకీయులంతా ఏకమై ఓడించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇచ్ఛాపురం నియోజవర్గంలో అంతా కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తున్నా, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పిరియా సాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు అనుచరులు రెండు గ్రూపులుగానే ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ మధ్య కొంతకాలం గ్రూపుల పోరు నడిచింది. దానికితోడు ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో నెలకొన్న విబేధాలు రచ్చకెక్కడంతో పార్టీ పరువు పోయింది. పార్టీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించి ఆయన సతీమణి దువ్వాడ వాణికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించింది. దువ్వాడ కుటుంబానికి ఇంటా బయట పోరుతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఎన్నికల కమిటీ, ఎన్నికల రథ సారథులంటూ కీర్తిస్తున్న తరుణంలో పార్టీలో నెలకొన్న విబేధాలను ఎంతవరకు పరిష్కరించగలదు, అసమ్మతిని ఏమేరకు చల్లార్చగలదన్నది చూడాల్సి ఉంది.










