May 02,2023 23:22

వికె.రాయపురంలో ధాన్యం రాశులపై బరకాలు తొలగిస్తున్న రైతులు, నెలకొరిగిన పంటను సిబ్బందికి చూపుతున్న రైతు

-ఆగని వానలు - తడిసిన ధాన్యం
-ఆరబోత పనుల్లో రైతులు
-తప్పని అదనపు భారం
- దయనీయ స్థితిలో అన్నదాత

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలు కారణంగా రైతులు కోతలు కోసి కళ్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి మద్దుయి కన్నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టగా సగం పంట కూడా చేతికందే పరిస్థితి కనిపిం చడం లేదు. మంగళవారం కూడా కాకినాడ రూరల్‌, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, శంఖవరం తదితర మండలాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండ డంతో ధాన్యం ఎక్కడికక్కడ రాశులుగా ఉండిపోయింది. కొన్ని మండలాల్లో వర్షం కాస్త తెరిపివ్వడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనుల్లో రైతులు నిమగమయ్యారు.
శ్రీకొనుగోలు ఆలస్యం కావడంతోనే...
కాకినాడ జిల్లాలో ఇప్పటికే 50 శాతానికి పైనే రబీ కోతలు పూర్తయ్యాయి. కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమవడంతో పలుచోట్ల ధాన్యం కళ్ళల్లోనే ఉండిపోయింది. గత 20 రోజుల్లో జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1306 మంది రైతుల నుంచి రూ. 19.34 కోట్లు విలువ చేసే 10,244 మెట్రిక్‌ టన్నుల దాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. వాతావరణ శాఖ గత వారంరోజుల నుంచి వర్షం హెచ్చరికలు చేస్తూనే ఉన్నా జిల్లా యంత్రాంగంలో చలనం లేదు.
శ్రీతడిసి ముద్దయిన ధాన్యం
ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆచరణలో వాహనాలు, సంచుల కొరత వేధించిన మూలంగా ధాన్యం రోజుల తరబడి కళ్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 80 వేల ఎకరాల్లో కోతలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 10 వేల ఎకరాల్లో వరి నేలను తాకింది. సుమారు 5.50 వేల ఎకరాల్లో వరి కోసి పనలపై ఉంది. మూడు రోజులుగా వర్షాలకు ధాన్యం మొలకెత్తుతుందని రైతులు చెబుతున్నారు. సుమారు 6 వేల ఎకరాల్లో దాదాపుగా 21 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయిందని అధికారుల లెక్క. అయితే దీనికి రెట్టింపు ధాన్యం రాశులుగా పోసి కళ్ళల్లోనే ఉండిపోయింది. ఇంకోవైపు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం ఎన్ని రోజులు ఆరాబెట్టాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు కొనుగోలు చేస్తే తడిసిన ధాన్యం నూకలుగా మారుతుంది. సగం ధర మాత్రమే వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీఅదనపు భారం
ఇప్పటికే యంత్రం ద్వారా కోతలు పూర్తి చేయడానికి గంటన్నర సమయానికి ఎకరాకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో పలువురు రైతులు వేగంగా కోతలు పూర్తి చేసేందుకు అధిక ఖర్చు తో పనులు మొదలెట్టారు. ఇప్పుడు రాశులుగా ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మూడు, నాలుగు రోజులు సమయం పట్టే అవ కాశం ఉంది. దీంతో బరకాల అద్దె భారం కూడా మోయల్సి వస్తోంది. మరో వైపు ధాన్యం ఆరిన తర్వాత నూకలుగా మారే అవకాశం ఉంది.దాంతో ప్రభుత్వం ఈ ధాన్యాన్ని ఒక వేళ కొనుగోలు చేసినా మిల్లర్లు ఎంత చెల్లి స్తారనేది ప్రశ్నార్థకమే. అనుకూల పరిస్థితుల్లో ఇప్పటికే ఆర్‌బికెల నుంచి మిల్లర్లకు ధాన్యం వెళుతుండగా నూకల శాతం ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు.
శ్రీధాన్యం కొనుగోలు చేస్తాం
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ తెలిపారు. మంగళవారం కరపలో, కాజులూరు మండలాల్లో పర్యటించి కళ్లాలపై ఉన్న ధాన్యపు రాశుల్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. తేమ తగ్గినా, రంగు మారినా ఆందోళన చెందనవసరం లేదని ఆ ధాన్యాన్ని కూడా ఆర్‌బీకేల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
ఆగని వర్షం .. తప్పని ఇక్కట్టు
సామర్లకోటరూరల్‌ : అల్పపీడన ప్రభావంతో రెండో రోజు సామర్లకోట మండల పరిధిలో ఆగి ఆగి వర్షం కురుస్తూనే ఉంది. సోమవారం భారీ వర్షంతో తడిసిన పంటను మంగళవారం ఉదయం కొంతసేపు ఎండ రావడంతో రైతులు ధాన్యం రాశులను విడదీసుకుని ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. మంగళ వారం సామర్లకోటలో 33.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. మళ్లీ అంతలోనే వర్షం పడడంతో మరలా బరకాలు కప్పుకొని ధాన్యం రాశులను భద్రపర్చుకుం టున్నారు. వికెరాయపురం, బోయినపూడి, మాధవపట్నం తదితర ప్రాంతాల్లో వర్షంతో పనలపై పంట తడిసిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సూచనలతో మండలంలో ప్రస్తుతం వరి కోతలును రైతులు వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్‌ అధికారులు, పిబిసి, గోదావరి కాల్వ ద్వారా పంట పొలాలకు వెళ్లే నీటి కాల్వలకు నీటి సరఫరాను నిలుపుదలచేశారు. భీమవరం ప్రాంతంలో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.