రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు నిరసన
ప్రజాశక్తి - దెందులూరు
ప్రస్తుత వర్షాల నేపథ్యంలో కల్లాల్లోని ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఉండ్రాజవరంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని సత్యనారాయణపురం, దెందులూరు, కొవ్వలి, పోతునూరు గ్రామాల్లో పర్యటించి కల్లాలోని ధాన్యాన్ని పరిశీలించారు. వాయుగుండం ఫలితంగా వర్షపు చినుకులు రావడంతో పరుగులు తీయాల్సి వస్తోందని రైతు సంఘం నాయకుల వద్ద రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో కల్లాలోనే ధాన్యం ఉండిపోయిందని చెప్పారు. రవాణా, హమాలీలు ఏర్పాటును రైతే చేసుకోవాలని చెప్పడంతో చేతిలో చిల్లిగవ్వలేని రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రవాణా, హమాలీల ఏర్పాట్లు ప్రభుత్వమే చూడాలని కోరారు. ధాన్యాన్ని తూకం వేసిన తర్వాత ఏ మిల్లుకు తీసుకువెళ్లాలో అనే విషయాన్ని ఆలస్యంగా చెప్పడంతో లారీలు, ట్రాక్టర్ల యజమానులు ధాన్యం రవాణాకు ముందుకు రావడం లేదని చెప్పారు. 34 బస్తాల మించి ధాన్యం కొనుగోలు చేయలేమని కొనుగోలు పరిమితి పెట్టడం వల్ల 34 బస్తాలు మించి దిగుబడి వచ్చిందని మిగిలిన ధాన్యాన్ని ఏమి చేసుకోవాలని ప్రశ్నించారు. కొనుగోలు పరిమితి 40 బస్తాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు గోనె సంచులు అందించాలని కోరారు. వాయుగుండం నేపథ్యంలో తేమశాతం నిబంధన సడలించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సున్నా వెంకట్రావు, రావాడ నాగిరెడ్డి, లంకా శ్రీనివాసరావు, బుగత తాతారావు, నల్లి ప్రసాద్ పాల్గొన్నారు.










