Oct 30,2022 21:38

ఎపి కౌలురైతు సంఘం మండల మహాసభలో నేతలు
ప్రజాశక్తి - ఉంగుటూరు

            కౌలు రైతుల నుండి కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి అక్కడే చెక్కులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. కైకరం తూర్పు వీధిలోని కళ్యాణ మండపంలో ఎపి కౌలు రైతుల సంఘం మండల మహాసభను దుడే కేశవ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వాస్తవ కౌలు రైతుల పేర్లను ఇ-క్రాప్‌లో నమోదు చేయలేదన్నారు. అర్హులకు పంట సాగుదారు హక్కు పత్రాలు అందలేదన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా వరి సాగు చేసిన కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు సమయంలో వ్యవసాయ శాఖ నుండి కౌలు రైతులకు ధ్రువపత్రాలు ఇప్పించి కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో ధాన్యం డబ్బు చెల్లించకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుత ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమస్య, సొమ్ము చెల్లింపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా కేరళ వామపక్ష ప్రభుత్వం రూ.900 ఇచ్చి క్వింటాల్‌ ధాన్యాన్ని రూ.2800కు కొనుగోలు చేస్తోందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కోరారు. బ్యాంకుల నుండి కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సమావేశంలో సంఘం సీనియర్‌ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, ఎపి కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు, జిల్లా కోకన్వీనర్‌ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు.