వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి
ప్రజాశక్తి - ముదినేపల్లి
నిబంధనలు సడలించి రైతుల వద్ద నుంచి ధాన్యం కళ్లాల నుంచే కొనుగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శనివారం కౌలురైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహాశీల్దార్ కె.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మండలంలో సార్వా ధాన్యం కోతలు జరుగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనలు రైతులకు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. విక్రయించిన ధాన్యానికి రైతులకు నాలుగైదు నెలల వరకూ సొమ్ము ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ సీజన్‌లోనైనా ధాన్యం విక్రయించిన పది రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మురాల రాజేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహాంకాళిరావు, కౌలురైతు సంఘం జిల్లా నాయకులు ఉల్లంకి నాంచారయ్య, మండల కార్యదర్శి చిన్నం మాధవ, నాయకులు దాకరపు నాగేశ్వరరావు, గద్దె అనిల్ తదితరులు పాల్గొన్నారు.










