వరి రైతుల వేదన వర్ణనాతీతం
లారీలు, సంచుల్లేక అవస్థలు
ముక్క పేరుతో తారాస్థాయికి మిల్లర్ల దోపిడీ
వర్షాలకు తడిసి ముద్దవుతున్న ధాన్యం.. దిక్కుతోచని అన్నదాత
రెండు జిల్లాల్లోనూ దాదాపు 50 శాతం పంట కళ్లాల్లోనే
కనీసం రైతులను పలుకరించని మంత్రులు, ఎంఎల్‌ఎలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
రైతుల కంట కన్నీరొలుకుతోంది. కళ్లాల్లో తడిసిన ధాన్యం చూసి అన్నదాత విలవిల్లాడిపోతున్నాడు. ఒకపక్క లారీలు లేక, మరోపక్క సంచులు అందక, చితుకు పేరుతో మిల్లర్ల దోపిడీ వంటి కష్టాలతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పిస్తున్నా లారీలు మాత్రం పంపకుండా నిలిపివేయడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతుల వేదన చూసిన వారంతా 'అయ్యో.. అన్నదాత' అనే పరిస్థితి ఏర్పడింది.
రబీ ధాన్యం కొనుగోలులో ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి సంబంధం లేకుండాపోయింది. రైతులు పడుతున్న కష్టాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఉంది. రెండు జిల్లాల్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఏలూరు జిల్లాలో 3.90 లక్షల మెట్రిక్ టన్నులు, పశ్చిమలో 9.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకూ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే 50 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. కళ్లాల్లో ఇంకా సగం పంట ఉండిపోయింది. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటంతా తడిసి ముద్దవుతోంది. రాశులు చేసిన ధాన్యం కిందిభాగం పూర్తిగా తడిసిపోయి మొక్కలు వస్తుండగా, కోత దశలో ఉన్న పంట మాసూలు చేసేందుకు వీల్లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు నానావస్థలు పడుతున్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీక నానాయాతన అనుభవిస్తున్నారు. బాగున్న ధాన్యం విక్రయించేందుకు ప్రయ త్నించినా లారీలు, సంచులు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎంఎల్‌ఎలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం రైతులను పలుకరించకపోవడం గమనార్హం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే సమస్యలు తెలుస్తాయి. రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రకటనలకు మాత్రమే ప్రజాప్రతినిధులు పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లారీలు లేవు.. సంచులు ఇవ్వలేదు
సూరత్తుల శ్రీనివాస్, కాగుపాడు, ఉంగుటూరు మండలం
'18 ఎకరాల్లో వరిసాగు చేశాను. ఏప్రిల్ 12న మాసూలు చేశాను. సంచులు ఇవ్వకపోవడంతో సొంతంగా సమకూర్చుకోవాల్సి వచ్చింది. లారీలు రాకపోవడంతో సొంతంగా లారీ ఏర్పాటు చేసుకుని 467 సారలతో ఒకలోడు మిల్లుకు పంపించాం. ముక్కపేరుతో రూ.27 వేలు కోత వేస్తామంటున్నారు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.'
'మూడెకరాల ధాన్యం తడిసిపోయింది
జోగిరామారావు, అమ్మపాలెం, పెదవేగి మండలం
ఖరీఫ్ ధాన్యం కుప్పలు వేసి మాసూలు చేశాం. కురుస్తున్న వర్షాలకు మూడెకరాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యి మొలకలు వచ్చాయి. దీనిపై ఏం చేయాలో అర్థం కావడం లేదు. వర్షాలతో ధాన్యం ఆరబెట్టేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వెంటాడుతున్న లారీలు, సంచుల సమస్య
జిల్లాలో ఆది నుంచి లారీలు, సంచుల సమస్య రైతులను వెంటాడుతోంది. ఏప్రిల్ 16న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా ఇప్పటికీ లారీలు, సంచుల సమస్య పరిష్కారం కాలేదు. రైతులే సొంతంగా సంచులు, లారీలు సమకూర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో కిరాయి నిమిత్తం ఖర్చు తడిసి మోపెడవుతోంది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మంగళవారం లారీలను పూర్తిగా నిలిపివేసింది. మండలానికి ఒక్క లారీ రావడమే గగనంగా మారింది. ఉంగుటూరు, దెందులూరు వంటి మండలాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. పశ్చిమలోనూ పరిస్థితి ఇదేవిధంగా ఉంది. లారీలు, సంచులు రైతులకు అందించకపోవడంతో ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదు. మరోపక్క ధాన్యం మిల్లుకు పంపించిన తర్వాత ముక్కవుతుందంటూ పెద్దఎత్తున ధరలో కోత పెడుతున్న పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లాలో పౌర సరఫరాలశాఖ అధికారులు ధాన్యం కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు.. రైతులు పడుతున్న ఇబ్బందులకు పొంతన లేకుండాపోయింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. వర్షాలు వీడకపోవడంతో మొలకెత్తిన, తడిసిన ధాన్యం పరిస్థితి ఏమిటో రైతులకు అర్థం కాకుండాపోయింది.










