నడిరాతిరి దుప్పటిలా మారి
నను కప్పేసినపుడు.. మనసులో
కలల నడక మొదలవుతుంది.
స్వప్నాలన్నీ ఒక్కొక్కటిగా వరుసపెట్టి
నా కళ్ళముందు తెరలా మారి కనిపిస్తాయి.
ఊహాలన్ని సాలెగూడల్లినట్లు...
మనసులో ప్రతిమూల కలలు అల్లుకుంటాయి.
ఇక్కడున్నదంత మనుషుల రూపం కాదు
ఇదో మాయపొరల ప్రపంచం
ఆశల్ని ఆవిరిచేసి...కష్టాల్ని దోచేసే
అందమైన మనుషుల ముఖాల్ని తొడిగిన
మనుషులున్నారు ఇక్కడ
అందుకే నిద్రిస్తున్న కళ్ళలో
కలల ప్రపంచాన్ని చూస్తుంటాను
కాస్త కలల నడక నడుస్తుంటాను
నిశీదిరాత్రిలో...నది తన హృదయంలో
చందమామ అందాల్ని...తారల ప్రతిబింబాల్ని
దాచుకున్నట్లు....
ఉదయపువేల కొండకోనల మధ్య
మంచుతెరలన్నీ కమ్ముకొని మాయతెరలను
ఏర్పర్చినట్లు....
ఏ చెట్టుపైనో కూర్చొని కోకిలమ్మ
తన వినసొంపైన గానాన్ని వినిపిస్తున్నట్లు...
నా ఎదలో కలలన్నీ నీటి ఆవిరిలా
మబ్బులను కమ్ముకుంటాయి
అవి వానై కురుస్తాయేమోనని ఆశ
కురిసినట్లే కురిసి కనుమరుగైపోతాయి
నా కలల నడక ఎవ్వరికీ కనిపించదు.
నా గుండెలయ చప్పుడు ఎవ్వరికీ వినిపించదు.
వెలుగుకంటే చీకటే గొప్పదేమో...
వెలుగొస్తే ఈ మాయప్రపంచం
మళ్ళీ దర్శనమిస్తుంది
కష్టాల ప్రయాణం సాగుతూనే ఉంటుంది
అందుకే నా కలల నడక నాకిష్టం
అక్కడ సేదతీరుతూ కలలుకంటాను
ఒక మంచి ప్రపంచాన్ని తలచుకుంటూ
అశోక్ గోనె
94413 17361