
ఇసుకాసురుల బరితెగింపు మరోసారి కలకలం రేపింది. గతంలో కమలాపురం నియోజకవర్గ నేత చేష్టల కారణంగా పోరుమామిళ్లకు చెందిన వైసిపి నాయకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గ నాయకుల మధ్య ఆధిపత్య రాజకీయాల్లో భాగంగా అధికార పార్టీకి చెందిన నాయకునిపై దాడి దశ నుంచి ఏకంగా కిడ్నాప్ చేసి గాయపరచడం వంటి ఘటనలతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లాలోని జమ్మలమడుగు, కమలాపురం, రాజంపేట, ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రాలుగా ఇసుకాసురుల చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడనిదే భూగర్భశోకం తీరదు. ఇసుకాసురుల ఆగడాలన్నింటి వెనుక ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని ఓ ఇసుక క్వారీ నుంచి మైనింగ్ నిబంధనలను బేఖాతర్ చేస్తూ సుమారు 10 నుంచి 12 మీటర్ల వరకు గుంతలు తవ్వి ఇసుకను కొల్లగొడుతుండడం దోపిడీకి పరాకాష్ట్రగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎవరు అధికారం చేపట్టినా ప్రకృతి వనరులను చెరపట్టి కొల్లగొట్టి భారీగా సొమ్ము చేసుకునే యజ్ఞం పదేళ్లుగా సాగిపోతోంది. ఇసుక, మట్టి, ఎర్రచందనం, భూకబ్జాలను వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జిల్లా పరిషత్ కార్యాలయంలో నీటి వనరులపై ఓ కామ్రేడ్ రచించిన పుస్తకావిష్కరణ సభలో ఓ రిటైర్డు జస్టిస్ ఇసుకను కొల్లగొట్టడం వల్ల నీటి వనరుల లభ్యతపై పెనుప్రభావం పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మేధావులు, బుద్ధిజీవుల నుంచి హెచ్చరికలు, ఆందోళనలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఆందోళనకరం. ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకున్నా ఉపయోగం ఉండదనే హితవు చెవికి ఎక్కడం లేదు. అంతులేని ధన దోపిడీకి కళ్లెం వేయాల్సిన తరుణం ఆసన్నమైందని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని మేధావులు, బుద్ధిజీవులు, విద్యావంతుల్లో చలనం రావాల్సిన అవసరం ఉంది. ఉత్తముల మౌనం వల్ల సమాజానికి తీవ్రహాని జరుగుతుందనే అంశాన్ని గ్రహించాల్సిన అవసరం ఏర్పడింది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల దోపిడీకి హద్దు పద్దూ లేకుండా పోతుంది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, అనుచరుల రూపంలో ఉండడం వల్ల జిల్లాకు చెందిన అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వమే ప్రకృతి వనరులకు వాటిల్లుతున్న హానిపై స్పందించాల్సిన అవసరం ఉరుముతోంది.
- ప్రజాశక్తి - కడప ప్రతినిధి