మళ్ళీ గత్తరకాలం వచ్చిందంటుండు తాత
ఎన్నాళ్ళనుంచి ఎదురుచూసిందో
ఈ కానరాని కరోన
ఇండ్లకే కట్టేసి పగతీర్చుకుంటుంది
బయటకి వెళ్తే బూచాడు వస్తాడని
భయపెట్టేది చిన్నప్పుడు అమ్మ
ఇప్పుడు అమ్మమాటే లక్ష్మణరేఖ
ఇది కలికాలంగాదు కరోనా కాలం
మనిషి చావును కూడా
కళ్లారా చూడకుండ చేసింది
వలసకూలీల రెక్కలు నరికి
వాళ్ళ ఉసురుబోసుకుంటుంది
ఆసుపత్రినే ఇల్లుగా చేసుకున్న
డాక్టర్ల మానవత్వం ఒక వైపు
చూపులను రోడ్లకతికించి
కాపుగాస్తున్న పోలిసన్నల సేవ మరోవైపు
గడపదాటకుండ ఉండడమే
మనం చేయాల్సిన దేశసేవ
కలిసివుంటే కలదు సుఖమని
చిన్నప్పుడు చదువుకున్నాం గానీ
విడివిడిగా వుంటూ
ప్రాణాల్ని రక్షించుకోవడం ఇప్పటి పాఠం
- పల్లె రాజుగౌడ్
9666207288