Jul 01,2023 00:42

భారీ జన సమూహంతో సాగుతున్న పాదయాత్ర, అభివాదం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం
పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాజకీయ పార్టీలతో పాటు అంతా కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వం మెడలు వంచుదామంటూ సిపిఎం, టిడిపి, జనసేన, కాంగ్రెస్‌ నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జూన్‌ 20న ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రారంభమైన పోలవరం పోరుకేక పాదయాత్ర 11వ రోజు శుక్రవారం బుట్టాయగూడెం నుంచి ప్రారంభమై మర్లగూడెం, ఏజెన్సీ ముఖద్వారం జంగారెడ్డిగూడెం మీదుగా గుర్వాయిగూడెం వరకు సాగింది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మర్లగూడెం కొత్తకాలనీ వాసులు హారతులిచ్చి పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం పొలిమేరల్లో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నాయకులు పాదయాత్ర బృందానికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. బైపాస్‌ రోడ్డు వద్ద జంగారెడ్డిగూడెంలోని చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ ప్రసాద్‌ కుటుంబ సమేతంగా విచ్చేసి పాదయాత్ర బృందానికి స్వాగతం పలికారు. డివైఎఫ్‌ఐ బృందం, స్థానిక సిపిఎం నాయకులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. బైపాస్‌ రోడ్డు వద్ద మార్కెట్‌ యార్డులో భోజన విరామ అనంతరం జంగారెడ్డిగూడెం జెపి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పాదయాత్ర బృందం తరలివెళ్లింది. ఈ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు జెట్టి గురునాధరావు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక్‌ ముస్తఫా, సిపిఎం రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారాం, ఎవి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎ.రవి, నేతలు కిరణ్‌, తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి, డిఎన్‌విడి.ప్రసాద్‌, ఆర్‌.లింగరాజు, వాణిశ్రీ, రాంబాబు, విఆర్‌పురం ఎంపిపి కారం లక్ష్మి, కుంజా రాధ, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ నిర్వాసితుల సమస్యలపై పోరాడాలన్నారు. వైసిపి ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై నాయకులంతా మండిపడ్డారు. ఇది జాతీయ సమస్య అని, బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్య పరిష్కారమయ్యే వరకూ అంతా కలిసికట్టుగా పని చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సభ అనంతరం పాదయాత్రలో నిర్వాసితుల నుంచి వచ్చిన సమస్యలు కాలనీల్లో పరిస్థితులపై నాయకులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గఫూర్‌ కాలికి గాయం..
పోలవరం పోరుకేక మహా పాదయాత్రలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్‌ కాలికి గాయమైంది. బుట్టాయగూడెం నుండి ప్రారంభమైన యాత్రలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. పాదయాత్రలో నడుస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న గోతుల్లో ఆయన అదుపు తప్పి పడిపోయారు. మోకాలుకు గాయం కావడంతో కార్యకర్తలు హుటాహుటీన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. డాక్టర్‌ వజ్రకిరణ్‌ గఫూర్‌కు వైద్య సేవలందించారు.