Oct 13,2023 23:11

కలిసికట్టుగా చిత్తూరు నగరాబివృద్ధి ప్రశాంతంగా కౌన్సిల్‌ సమావేశం

కలిసికట్టుగా చిత్తూరు నగరాబివృద్ధి
ప్రశాంతంగా కౌన్సిల్‌ సమావేశం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌
కలసికట్టుగా చిత్తూరు నగరాభివృద్ధి చేయాలని ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం నగర మేయర్‌ ఎస్‌ అముద అధ్యక్షతన జరిగింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల హౌదాలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్‌ డా. జె అరుణ, డిప్యూటీ మేయర్లు ఆర్‌ చంద్రశేఖర్‌, రాజేష్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో అజెండా అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు.
నగరపాలక సంస్థలో టిపిఒగా పనిచేస్తున్న డి.మురళీకృష్ణను డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ మంగళగిరి వారికి సరెండర్‌ చేయాలని ఆమోదించారు. మదనపల్లిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు టి.అన్బును చిత్తూరుకు బదిలీ చేశారు. గాండ్లపల్లి విలేజి రీడ్స్‌పేట్‌ ఏరియాలోని 12,164 చదరపు అడుగుల స్థలంలో 2,400 చదరపు అడుగుల స్థలాన్ని లీజ్‌కు కేటాయించేందుకు ఆమోదించారు. నగరపాలక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా వి. లోకనాథరెడ్డిని నియమించారు. 15వ ఆర్థిక సంఘం 2022-23 ప్రతిపాదనలు మంజూరు చేసిన మొత్తం రూ. 4.51కోట్ల వార్షిక అభివద్ధి ప్రణాళికను ప్రభుత్వ ఆమోదం కోసం పంపడానికి కౌన్సిల్‌ ఆమోదించింది. టేబుల్‌ అజెండాగా నగరపాలక సంస్థలో వివిధ కేటగిరిలో 28 పోస్టులు మంజూరు చేయుట కొరకు పురపాలక సంచాలకులు, పుర పరిపాలన శాఖ గుంటూరు వారికి పంపుటకు, ఏఎస్‌ఎమ్‌, ఎమ్‌ఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ లో అద్దె చెల్లించని వారి నుండి బకాయిలను రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ద్వారా వసూలు చేయుటకు, నగరపాలక సంస్థ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నందు ఖాళీగా ఉన్న షాపులు బాడుగ ఇచ్చుటకు, బహిరంగ వేలం చేయుటకు, గంగినేని చెరువు కట్ట మీద ఉన్న టైల్స్‌ రోడ్డుపై ప్రజలు వాకింగ్‌ చేయడానికి వీలుగా సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఎటువంటి వాహనములను అనుమతించకుండా నిషేధించుటకు కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. టిడ్కో గహాల్లో మిగిలిన పనులను వీలైనంత వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, అర్హులైన ప్రతి మహిళకూ ఇంటి స్థలం, ప్రభుత్వ ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగరంలో కొన్నిచోట్ల దారులు ఆక్రమణలకు గురయ్యాయని, వీటిపై కోర్టులో నడుస్తున్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు.