Sep 27,2023 20:00

కలగా 'ఏకలవ్య పాఠశాల'

 రాజంపేట : మారుమూల గిరిజన ప్రాంతాలు, ఆవాసాల్లో ఉంటున్న గిరిజనుల పిల్లలకు విద్య అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా వారి కోసం నాణ్యమైన విద్యనందించేందుకు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏకలవ్యవ మోడల్‌ పాఠశాలలను జిల్లాలో ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనుల పిల్లలు విద్యకు దూరవుతున్నారు. 1997-98 సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల్లో అక్షరాస్యతా శాతం పెంచి వారిని గిరిజనేతరుల తరహాలో విజ్ఞానాన్ని పెంపొందించేలా దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో 38 పాఠశాలలున్నాయి. 20 వేల గిరిజన జనాభా కలిగిన ఒక నియోజకవర్గం లేదా ఒక బ్లాక్‌లో ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేయాల్సింది. గిరిజన బాలబాలికలకు కో-ఎడ్యుకేషన్‌ విధానంలో నాణ్యమైన సెంటల్‌ సిలబస్‌ విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తోంది. జిల్లాలో రైల్వేకోడూరు నియో జకవర్గంలో అత్యధికంగా ఎరుకల, యానాది సామాజికవర్గానికి చెందిన జనాభా 25 వేల వరకు ఉంది. ఇలాంటి విద్యా సంస్థ నెలకొల్పి జవహర్‌ నవోదయ తరహా విద్యను గిరిజన విద్యార్థులకు అందించాల్సిన అవసరముంది. ఈ వ్యవస్థ ప్రారంభమై నేటికీ 25 ఏళ్లవుతున్నా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు జిల్లాలో ఒక్క అడుగు పడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. 20 వేల గిరిజన జనాభా ఉంటే పాఠశాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గానికి పాఠాశాలను ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయి. ఈ ప్రాంతంలో ఏకలవ్య స్కూల్‌ను ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రజలు కోరుతున్నా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర కేంద్రానికి పంపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్యతోపాగు భోజన వసతి సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఏర్పాటుకు భవనం, ఆట స్థలం కోసం స్థలం కేటాయించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఉన్నప్పటికీ మన జిల్లాలో లేకపోవడం బాధాకరం. ఇందులో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థికీ విద్యా, భోజన, వసతి, ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం గతంలో ఏటా రూ.62 వేలు ఇచ్చే వారు. ప్రస్తుతం రూ.1.09 లక్షలు అయింది. గిరిజనులకు ప్రత్యేక స్కూల్‌ ఎక్కడా లేదు. ఒక రైల్వేకోడూరు మండలంలో మినీ గురుకుల బాలికల పాఠశాల మాత్రమే ఉంది. బాలికలకు మాత్రమే గిరిజన గురుకులాలు ఉన్నాయి. బాలురకు ఎక్కడా లేకపోవడంతో గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతోంది. రైల్వేకోడూరు నియోజకవర్గం నెల్లూరు ఐటిడిఎ యానాదుల ప్రత్యేక కార్పొరేషన్‌ పరిధిలో ఉంది. యానాదులు అభివృద్ధి కోసం ఐటిడిఎ ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా రాబోయే విద్యా సంవత్సరంలోనైనా ఐటిడిఎ అధిక్నాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు గిరిజనుల పిల్లల విద్యాభివృద్ధి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపి స్కూల్‌ మంజూరుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాఠశాల ఏర్పాటు చేయాలి
గిరిజన విద్యార్థులకు ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌ వరంలాంటిది. వారికి నాణ్యమైన విద్య అందించేందుకు రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. ఈ నియోజకవర్గంలో 35 వేలకు పైగా జనాభా ఉన్నారు. రాబోయే విద్యా సంవత్సరంకు స్కూల్‌ను తెరిచి గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి.
- జలకం శివయ్య, జిల్లా అధ్యక్షులు, యానాదుల సంక్షేమ సంఘం, అన్నమయ్య జిల్లా.
ప్రతిపాదనలు పంపుతాం
ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. నిధుల కొరత కారణంగానే ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యమవుతోంది. రైల్వేకోడూరు మండలంలో పాఠశాల నిర్మాణానికి 20 ఎకరాల స్థలం మంజూరు చేయాలని తహశీల్దార్‌కు ప్రతిపాదనలు పంపామం. తహశీల్దార్‌ నుంచి ఇంకా అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
- అబ్‌సలాం, గిరిజన సంక్షమ జిల్లా అధికారి, అన్నమయ్య జిల్లా.