May 29,2023 23:38

ప్రజాశక్తి-కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డా. కతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరు కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ కతికాశుక్లా, జెసి ఎస్‌.ఇలాక్కియ, ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, జెడ్‌పి సిఇఒ ఎన్‌వివి.సత్యనారాయణ, బిసి, ఎస్‌సి కార్పొరేషన్ల ఇడిలు ఎస్‌విఎస్‌.సుబ్బలక్ష్మి, డిఎస్‌ సునీతతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 310 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 31న జెఎన్‌టియుకె స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కాకినాడకు వస్తున్న సందర్భంగా సోమవారం కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విసి జివిఆర్‌.ప్రసాద్‌ రాజు, ఎఎస్‌పి బి.సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి, రెవెన్యూ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో కలిసి కాకినాడ పోలీస్‌ పరేడ్‌ మైదానంలోని హెలిప్యాడ్‌, జెఎన్‌టియుకెలో గెస్ట్‌ హౌస్‌, సభా వేదిక వద్ద ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ పరేడ్‌ మైదానం నుంచి జెఎన్‌టియుకె వరకు కాన్వారు, ఇతర భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టరు వెంట రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎల్‌.సుమలత, రెక్టార్‌ కెవి.రమణ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఇ కె.హరిప్రసాద్‌ బాబు, డిఎస్‌పి అప్పారావు, కాకినాడ ఆర్‌డిఒ బివి.రమణ, కాకినాడ అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు సీతాపతిరావు, మురార్జీ పాల్గొన్నారు.