ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా తన భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగింది. బాధితురాలిలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండవల్లి మండలం దెయ్యంపాడు గ్రామానికి చెందిన సైదు బేబీ కుమారికి గ్రామంలో 56 సెంట్ల స్థలం ఉంది. దాన్ని అదే గ్రామానికి చెందిన ముంగర కనకం, ముంగర రామారావు, ముంగర కొండలు, ముంగర ఏసుపాదం కలిసి ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై అనేకసార్లు అధికారులు చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని, స్థలం సర్వే చేయడానికి వచ్చిన గ్రామ రెవెన్యూ అధికారి ఆక్రమణదారులు ఇచ్చే లంచాలకు ఆశపడి తన స్థల వివాదం ఎటూతేల్చడం లేదని, దీంతో జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశానని, అయినా న్యాయం జరగలేదని తెలిపింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె స్పందన కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె తనతోపాటు తెచ్చుకున్న పురుగులమందు సేవించేందుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే స్పందించి బేబీకుమారి చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఈ ఘటనలో ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బేబీకుమారి తెలిపింది.
స్పందించిన జెసి
దీనిపై స్పందించిన జెసి లావాణ్యవేణి మండవల్లి తహశీల్దార్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ఈ విషయమై తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ గతంలో బేబీకుమారి దాఖలు చేసిన స్పందన దరఖాస్తుపై గ్రామ సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారితో తహశీల్దార్ కలిసి దస్తావేజుల నకళ్ల ఆధారంగా భూమిని పరిశీలించామని, ఆ భూమి దట్టమైన ముళ్ల కంపలు కలిగి ఉండి, ముంగర ఏసుపాదం, కనకలింగేశ్వరరావు, రామారావు, కొండలు అనేవారు కూడా ఈ భూమి హక్కు కోసం సివిల్ కోర్టులో ఏడు దావాలు పెండింగ్ లో ఉన్నాయని తహశీల్దార్ జెసికి తెలిపారు. దీంతో సివిల్ కోర్టు దావాల్లో తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుందని మహిళకు జెసి తెలిపారు.










