Sep 10,2023 21:51

కలెక్టరేట్‌ వద్ద 'వేడుకోలు' దీక్ష చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ పార్ట్‌ టైం ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు ''వేడుకోలు''దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జెఎసి జిల్లా కన్వీనర్‌ బివి రమణ, నాయకులు బి.ఈశ్వరరావు, కె.నరసింహాచారి, శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్‌లో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సర్వశిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15శాతం జీతాలు పెంచినప్పటికీ సర్వ శిక్ష అభియాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం సమంజసం కాదన్నారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వ శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఈ విభాగంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదన్నారు. నిర్దిష్ట కాలం ప్రాతిపదికన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మెడికల్‌ లీవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు, రిటైర్‌ అయిన సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులకు రూ.20 లక్షలు గ్రాడ్యుటీ చెల్లించాలని, హెచ్‌ఆర్‌ఎ, డిఎ, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గత మూడు నెలల బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమను రెగ్యులర్‌ చేసే వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై ఇప్పటికే అనేక దశల్లో ఆందోళన చేపట్టామని, అయినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఉద్యోగుల గోడు తెలియజేయడం కోసం ఈ దీక్ష చేపట్టామని తెలిపారు, ఈ ''వేడుకోలు'' దీక్షలో సర్వ శిక్ష అభియాన్‌ జెఎసి నాయకులు ఎం.శాంతలక్ష్మి, ఎం.హైమావతి, ఇ.జ్యోతి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.