Aug 04,2023 23:41

కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో పాల్గొన్న కార్మికులు, నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. ధర్నా అనంతరం తర్వాత కలెక్టరేట్‌ గేటు వరకూ ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. తర్వాత జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌.కేశవరెడ్డికి వినతిపత్రం అందచేశారు. ధర్నాలో నేతాజి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, చిరు ఉద్యోగులందరికీ కనీసం రూ.10వేలు వేతనం ఇస్తామని వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయలేదని, సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయడం లేదని అన్నారు. ఒకే పని చేస్తున్న పంచాయతీ కార్మికులు వేర్వేరు పంచాయతీలలో వేర్వేరు జీతభత్యాలు తీసుకుంటున్నారని, ఇప్పటికీ నూటికి 70 మంది పంచాయతీ కార్మికులు రూ.10 వేల కంటే తక్కువ జీతం పొందుతున్నారని, ఆవి కూడా ఆరేడు నెలలు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు సిహెచ్‌.రామారావు మాట్లాడుతూ చాలా పంచాయతీల్లో యూనిఫారం కూడా మూడు నాలుగేళ్ల నుండి ఇవ్వడం లేదని, ఆదాయం ఉన్న పంచాయతీల్లోనూ ఏళ్ల తరబడి జీతాలు పెంచట్లేదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.సుబ్బారావు, మోహన్‌, బి.ప్రభాకరరావు, పి.ఆదిలక్ష్మి, కె.రాజకుమారి, ఎన్‌.రాహేలమ్మ పాల్గొన్నారు.