Nov 21,2023 21:21

కలెక్టరేట్‌ వద్ద వంటావార్పు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికులు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసిన అనంతరం వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు అమలు కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటాలకు మున్సిపల్‌ కార్మికులు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం మున్సిపల్‌ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేస్తామని చెప్పి, నేడు ఆ హామీకి దూరంగా ఉన్నారని విమర్శించారు. క్లాప్‌ ఆటో డ్రైవర్లను, ఇంజనీరింగ్‌ వర్కర్లను వైసిపి ప్రభుత్వం మోసగించిందని, అతి తక్కువ వేతనాలిచ్చి వెట్టిచాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉన్న మున్సిపల్‌ కార్మికులను, ఈ ప్రభుత్వం మోసగించిందన్నారు. జిల్లాలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నేటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని, విమర్శించారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ పట్టణాల్లో జనాభా పెరుగుతున్నా కార్మికుల సంఖ్యను పెంచడం లేదని, చనిపోతున్న కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయి లో బెనిఫిట్స్‌ ఇవ్వడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పురపాలక సంఘాలకు కలెక్టర్‌ నిధులు కేటాయించి, కార్మికులకు సబ్బులు, నూనెలు, ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో ఎఒకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణారావు, కోశాధికారి వెంకటరమణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ మహిళా కార్యదర్శి టి.ఇందూ, జిల్లా నాయకులు నాయకులు సింహాచలం, మల్లేష్‌, వేణు, భాస్కరరావు, సంజీవి, తదితరులు పాల్గొన్నారు.