ప్రజాశక్తి - ఏలూరు
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని, ఔట్‌సోర్సింగ్‌ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాల రాయితీలు పునరుద్ధరించాలని, జిఒ నెం.25ను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని, బదిలీల సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఎపిజెఎసి అమరావతి పిలుపు మేరకు చేపట్టిన ధర్నానుద్దేశించి జిల్లా ఛైర్మన్ కె.రమేష్‌కుమార్ మాట్లాడుతూ వార్షిక ఇంక్రిమెంటు ఇవ్వాలని,. సీనియార్టీ ప్రాతిపదికన వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ ఉద్యోగ నియామకాలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అన్నారు. రిటైర్‌మెంట్ తర్వాత ఉద్యోగ విరమణ భృతి రూ.15 లక్షలు ఇవ్వాలని, సమస్యలపై రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్ నిర్వహించాలని, 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి' అని, ఇహెచ్‌ఎస్ ద్వారా ఉచిత వైద్యం కల్పించాలని, సాధారణ, మెడికల్ లీవుల సౌకర్యం కల్పించాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎపిజెఎసి అమరావతి జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎ.ప్రమోద్‌కుమార్, ఎపి ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, జెఎసి రాష్ట్ర నేతలు హరినాద్, ఎఐటియుసి నేత బండి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, జెఎసి నేతలు నెరుసు రామారావు, శ్రీధర్‌రాజు, వీరబాబు, సిహెచ్.వర్మ, జ్యోతి, కమల్, సాయినాధ్ మాట్లాడారు.










