ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : న్యూస్ క్లిక్ పత్రిక కార్యాలయంపై ఇడి దాడులు, సంస్థ వ్యవస్థాపకులు ప్రబీర్ పురకాయస్థ, హెచ్‌ఐర్ హెడ్ అమిత్ చక్రవర్తిల అరెస్టుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు గురువారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తొలుత గాంధీ విగ్రహం నుంచి ప్రధాన రహదారి గుండా కలెక్టరేట్ ఔట్‌గేటు వరకు ప్రదర్శన నిర్వహించారు. 'జర్నలిస్టులపై దాడులను ఖండించాలని. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా? సిగ్గు సిగు'.. మీడియాపైదాడులు సహించబోం.. జర్నలిస్టుల గొంతు నొక్కడం దుర్మార్గం' అంటూ నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి జర్నలిస్ట్ సంఘాల నాయకులు కె.రమేష్‌నాయుడు, ఎంఎంఎల్ నాయుడు, గమిడి కోటేశ్వరరావు, జి.సూరిబాబు మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఈ సందర్భంగా ఖండించారు. బిజెపి ప్రభుత్వం విధానాలను విమర్శించే జర్నలిస్టుల పైనా, ఇతర ప్రగతిశీల మీడియాపైనా ఇడితో దాడుల చేయిస్తోందని అన్నారు. క్రూరమైన ఉపా చట్టాన్ని ఉపయోగించి ఢిల్లీ పోలీసులు జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేయడాన్ని వ్యతిరే కించారు. జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. న్యూస్ క్లిక్ కార్యాలయానికి సీలు వేయడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులపై కార్యాలయాలపై దాడి చేయడమంటే ప్రజా స్వామ్యంపై దాడి చేయడమే నన్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. ధర్నాలో జర్నలిస్టులు వెంకట్, ప్రయాగల రాజు, జయరాజ్, పరశురామ్, ఎం.రవిచంద్రశేఖర్, పి.అప్పారావు, సిహెచ్ రాము, ఎ.సత్య నారాయణ పాల్గొన్నారు.










