Jun 01,2023 00:21

కర్లపాలెంలో కూలీలతో మాట్లాడుతున్న కృష్ణ మోహన్‌

ప్రజాశక్తి - కర్లపాలెం : ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి.కష్ణమోహన్‌ తెలిపారు. ధర్నాలో కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలోని కొత్త నందాయపాలెం ,పాత నందాయపాలెం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను బుధవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి భారీగా నిధులు తగ్గించడం వల్ల ఉపాధి కూలీలు పనిచేసే చోట కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి కూలీలు ఫోటో యాప్‌ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు .కనీసం పనిచేసే చోట టెంటు సౌకర్యం , మంచినీళ్లు, మజ్జిగ, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మెడికల్‌ కిట్టు మరియు ఇతర సౌకర్యాలు లేకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జగం శామ్యూల్‌, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కొల్లూరు : మండల పరిధిలోని అనంతరం వరం, క్రాప గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఫొటో విధానాన్ని ఎత్తివేయాలన్నారు. ప్రతి కూలీకి రెండు వందల పనిదినాలు కల్పించాలన్నారు. రోజు వారీ కూలి రూ.600 ఇవ్వాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించాలన్నారు. వేసవి అలెవెన్స్‌ ఇవ్వాలన్నారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5న కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కూలీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. అద్దంకి : ఉపాధి పథకం కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న కలెక్టర్‌ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ధర్నాలో కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలోని చెరువు కొమ్ముపాలెంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రెండు పూటల మస్టర్‌ విధానాన్ని తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. దీంతో కూలీలకు ఉపాధి పనులకు దూరం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రతి కూలీకి రెండు వందల పనిదినాలు కల్పించాలన్నారు. రోజువారీ కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మర్‌ అలవెన్స్‌ పునర్ధురించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు కె. నాగూరు, యేసు మణెమ్మ, మేట్లు హనుమయ్య, భాస్కరరావు, ఉపాది కూలీలు పాల్గొన్నారు.