Aug 07,2023 21:40

మున్సిపల్‌ కార్మిక సంఘం నాయకుడిని లాగేస్తున్న పోలీసు

కడప అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారిసింది. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని ముట్టడి కార్యక్రమం చేపట్టారు. మూడు గంటల పాటు నిర్వహించిన కార్యక్రమానికి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నాయకులు, కార్మికులు ఆగ్రహించి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు..నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈనేపథ్యంలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరికి రక్తగాయాలు అయ్యాయి. మరో మహిళా కార్మికురాలు సృహ తప్పిపడిపోయింది. చాలా మందికి చొక్కాలు చిరిగి పోయాయి. ఫెడరేషన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి భుజానికి గాయమైంది. ఆయనను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. రక్తగాయాలైన వారు ఆసప్రత్రిలో చికిత్స తీసుకున్నారు. పోలీసులు నాయకులు, కార్మికులను అరెస్టు చేయడంతో ఆగ్రహించిన మహిళా కార్మికులు పోలీసుల వాహనానికి అడ్డుగా నిలిచారు. మగపోలీసులు మహిళా కార్మికులను నెట్టివేశారు. ఫలితంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మగ పోలీసులతో మహిళా కార్మికులను నెట్టివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులు వచ్చి హామీ ఇస్తే వెళ్లిపోతామని నాయకులు పోలీసులకు స్పష్టంగా తెలియజేశారు. వారు పట్టించుకోక పోవడంతో విధిలేని పరిస్థితిలో కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు నాయకులు, కార్మికులు ప్రయత్నించారు. అక్కడ ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. అరెస్టు అయనవారిని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొంత మందిని విడుదల చేశారు. మరికొంతమంది విడుదలపై సందిగ్ధం నెలకుంది.
హామీలు అమలు చేయమంటే అరెస్టులా?
- ఫెడరేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మనోహర్‌
మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే పోలీసులతో అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మనోహర్‌ అన్నారు. ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరావన్నారు. సమాన పనికి సమావేశం సుప్రీం కోర్టు తీర్పును అనుసరించాలని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్‌, సెమిస్కిల్డ్‌ జీతాలు ఇవ్వాలని చెప్పారు. పనిముట్టు అందించాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు సాధించుకునేందుకు అనేక పోరాటాలు చేశామని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు నాగేంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచుపాటి తిరుపాల్‌, విజయభాస్కర్‌, కోశాధికారి గోపి, సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిదేవి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, మద్దతుగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు విష్ణుప్రీతం రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
అరెస్టులను ఖండిస్తున్నాం : డివైఎఫ్‌ఐ
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద ధర్నా లో భాగంగా కడప కలెక్టరేట్‌ వద్ద శాంతియుత ధర్నా చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను అక్రమ అరెస్టులను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్యగా తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం రాగానే పర్మనెంట్‌ చేస్తామని పాదయాత్రలు ఊరూరా తిరిగి హామీ ఇచ్చారని ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, న్యాయమైన కోరిక అడగడం తప్పా అని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. సమావేశంలో నగర అధ్యక్షులు షాకీర్‌ పాల్గొన్నారు.