Aug 07,2023 21:09

కలెక్టరేట్‌ ముట్టడించిన మున్సిపల్‌ కార్మికులు

కలెక్టరేట్‌: మున్సిపల్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సిపిఎస్‌ రద్దు, ఇంజనీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు, రిస్క్‌ అలవెన్స్‌లు చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పాలకొండ, పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన మున్సిపల్‌ కార్మికులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అధికారులు బయటకు రావాలని, తమ సమస్యలపై వినతులు స్వీకరించాలని కోరారు. అయినా ఏ అధికారీ కార్మికుల సమస్యల సమస్యలను వినేందుకు రాలేదు. దీంతో కార్మికులంతా కలెక్టరేట్‌ను ముట్టడించారు. వెంటనే పోలీసులు కార్మికులను అదుపు చేసి, 53 మందిని తమ వాహనాల్లో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పూచికత్తుపై అందర్నీ విడుదల చేశారు. అనంతరం స్పందన కార్యక్రమం వద్దకు పాకల సన్యాసిరావు, చీపురుపల్లి సింహాచలం, నాగవంశం మల్లేషులు వెళ్లి జాయింట్‌ కలెక్టర్‌ వినతిపత్రం అందజేశారు. తొలుత మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.శంకరరావు, ఎన్‌వైనాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఆప్కాస్‌ విధాన కార్మికుల, ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ క్లాప్‌ ఆటో డ్రైవర్స్‌ సమస్యలు పరిష్కరించాలని బెలగాంలోని సుందరయ్య భవనం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు ప్రధాన రహదారి మీదుగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరు కార్యాలయాలనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్‌ కాంట్రాక్‌,్ట ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందర్నీ రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేయాలని, క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500 వేతనం ఇవ్వాలని, బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంజనీరింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ హెల్త్‌ రిస్కు అలవెన్స్‌ ఇవ్వాలని, ఆప్కాస్‌ వల్ల 60ఏళ్ల వయసు నిండినవాళ్లు, అనారోగ్యంతో మృతి చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుల కుటుంబాలకు వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. పార్వతీపురం పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న పదిమంది కార్మికులకు రూ.18వేలు పూర్తిస్థాయి జీతాలు ఇవ్వాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేసి ఆప్కాస్‌లో చేర్చి హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు తగినంత మంది కార్మికుల సంఖ్యను పెంచి ఉన్న కార్మికులపై పని ఒత్తిడిని తగ్గించాలని, మూడేళ్లుగా కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, చొప్పులు, ఇతర పనిముట్లు విడుదల చేయాలని, పార్వతీపురంలో బకాయి ఉన్న రెండు నెలల హెల్త్‌ అలవెన్స్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్‌ వర్కర్స్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ నాయకులు మల్లేషు, సింహాచలం, టి.రాముడు, టి.శంకర్రావు, పి.భాస్కరరావు, సంజీవి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దావాల రమణారావు, యమ్మల మన్మధరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ వి.ఇందిరా, సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాకల సన్యాసిరావు, సంచాన ఉమామహే శ్వరరావు పెద్దసంఖ్యలో పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.