ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, విద్యారంగంలో గల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకూ పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో జిల్లాలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నడంతో నినాదాలతో కలెక్టరేట్ హౌరెత్తించారు. అనంతరం జిల్లా కలక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి వినతిని అందించారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ, స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లోనూ, వసతి గృహాల్లో సరైన మౌలిక సదుపాయాల్లేక,మెనూ సక్రమంగా అమలు కాక, సరిపడా పాఠ్యపుస్తకాలు, మెరుగైన విద్య అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పాలకొండ గిరిజన పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనం నిర్మించాలని, గరుగుబిల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, సాలూరు కళాశాల బాలుర హాస్టల్‌కు రోడ్డు సౌకర్యం కల్పించాలని, పార్వతీపురంలో గల గిరిజన పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు అదనపు భవనాలు నిర్మించాలని, మున్సిపాలిటీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, గుమలక్ష్మిపురం, సాలూరు బాలురు పోస్టుమెటిక్ హాస్టలలో పెండింగులో ఉన్న డ్రైనింగ్ హాల్ పనులు పూర్తి చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ఛార్జీలు పెంచాలని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టలలో నీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు తదితర మౌళికసదుపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయాలని, లేనిచో భవిష్యతులో పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాజు, బి. గంగారావు, ఉపాధ్యక్షులు సిహెచ్ సింహాచలం, కె.భాస్కర్, హెచ్.చిన్నారి, కమిటీ సభ్యులు కె.రమేష్, అన్నాజీ, సురేంద్ర, బి.దిలీప్, శేఖర్, జయప్రకాశ్, శైలు, పవన్ కుమార్, షన్ముఖేష్, విద్యార్థులు పాల్గొన్నారు.










